తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పటి వరకు ఒకింత స్తబ్ధుగా ఉన్న రాజకీయ ముఖ చిత్రం 2018 సంవత్సరం ప్రారంభంతో పాటుగా స్థానిక ఎన్నికల సందడితో హడావుడి మొదలైంది. అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రతి పక్ష కాంగ్రెస్, బీజేపీలు గతానికి భిన్నంగా తన కార్యాకలాపాలను విస్తరించేందుకు సన్నాహాలు చేయబోతున్నాయి. ఇప్పటి వరకు సాధారణ స్థాయిలో తమ కార్యాకలాపాలను కొనసాగించిన ప్రధాన పార్టీలన్నీ భిన్నశైలిలో కార్యకలాపాలను సాగించాలని యోచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోతుండడంతో అన్ని పార్టీలు ఆ దిశగా సన్నద్ధం అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. మినీ జనరల్ ఎలెక్షన్గా పిలుచుకునే ఈ స్థానిక ఎన్నికలు అన్ని ప్రధాన రాజకీయ
పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారనున్నాయంటున్నారు.
ఈ ఎన్నికల ఫలితాలు 2019 సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నందున రాజకీయ పార్టీలన్నీ 2018 సంవత్సరాన్ని ప్రాతిపదికగా చేసుకోనున్నాయి. 2017లో తమ పార్టీ భవితవ్యంపై వెలువడిన సర్వే నివేదికలను సైతం తలకిందులు చేసేందుకు 2018 సంవత్సరాన్ని అస్త్రంగా వాడుకోబోతున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి స్థానిక ఎన్నికల ఫలితాలు కీలకమవుతున్నాయి. ఈ ఫలితాలు సాధారణ ఎన్నికలను శాసించే అవకాశాలు ఉన్నందున ఆ పార్టీ నేతలు ఈ సంవత్సరం కొత్త తరహా రాజకీయాలను చేపట్టనున్నారు.
అధికార టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు గుజరాత్ ఎన్నికలను కొలమానంగా చేసుకుంటూ రాబో యే స్థానిక, సాధారణ ఎన్నికల్లో దూసుకుపోయేందుకు ఇప్పటి నుండే పావులు కదపనున్నాయంటున్నారు. చిన్న నిర్లక్షం భారీ మూల్యాన్ని చె ల్లించే ట్రెండ్ కొనసాగుతున్న క్రమంలో ఈ రెండు ప్రధాన పార్టీలు ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదిలి పెట్టే పరిస్థితులు లేవంటున్నారు. వీటికి తోడుగా బీజేపీ గుజరాత్ ఎన్నికల విజయాన్ని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్ను ఎజెండాగా పెట్టుకొని 2018లో పెద్ద ఎత్తున ప్ర చారం చేస్తూ టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ధీటైన శక్తిగా మారాలని పరితపిస్తోంది.గ్రామ సర్పంచ్, ఎంపిటిసి, జడ్పీటీసీ, సహాకార సంఘాల ఎన్నికలు తెరపైకి రాబోతున్నందున ఇక ఈ సంవత్సరం రాజకీయ పరంగానే కాకుండా అభివృద్ది, సంక్షేమ పథకాల పరంగా పార్టీలన్నింటికీ ప్రతిష్టాత్మకం కాబోతుంది. ఈ నేపథ్యంలో 2018 సంవత్సరం అత్యంత ప్రజాధరణ సంవత్సరంగా నిలవబోతుందని అభివర్ణిస్తున్నారు.