ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సంక్రాంతిని ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకున్నారు. ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రామచంద్రాపురం మండలం రావిళ్లవారిపల్లెలో జగన్ సంక్రాంతి జరుపుకున్నారు.
ఈ సంక్రాంతికి అచ్చ తెలుగు పంచకట్టులో దర్శనమిచ్చారు జగన్. తళతళమెరిసే దుస్తులు ధరించి.. కుటుంబ సభ్యులతో కలిసి తెలుగు వారి పండుగను కోలాహలంగా జరిపారు. ఈ సంబురాల సందర్భంగా అక్కడే వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేయడంతో.. తండ్రి విగ్రహానికి జగన్ పట్టువస్త్రాలు సమర్పించి పండుగ జరుపుకున్నారు.
గోమాతకు ఆహారం అందించి.. పతంగులు ఎగరేసి.. వైసీపీ నేతలు, స్థానికులతో కలిసి సంబరాలు చేసుకున్నారు.తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన వైసీపీ అధినేత.. ఈ యేడు అందరికీ అంతా మంచి జరగాలని దేవున్ని కోరుకున్నట్టు చెప్పారు. సంక్రాంతి వేడుకల్లో జగన్ తల్లి విజయమ్మ కూడా పాల్గొనడం విశేషం. సంక్రాంతి సందర్భంగా ఇవాళ పాదయాత్రకు జగన్ విరామం ఇచ్చారు.