వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై ఏపీ ప్రజల్లో రోజు రోజుకీ జనాదరణ పెరుగుతున్న మాట వాస్తవమని సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఏపీలో జరిగిన గత ఎన్నికల్లోనూ ప్రజలు జగన్‌ను తిరస్కరించలేదని… టీడీపీ తరపున ముగ్గురు వచ్చినా జగన్ ఒక్కడే నిలబడినా ఓట్లు చాలా వచ్చాయని ఆయన గుర్తు చేశారు. జగన్ కేసుల విషయంలో భయపడాల్సిన అవసరమైతే లేదని.. న్యాయవ్యవస్థ పై రాజకీయ ఒత్తిడి రాకపోతే జగన్ పై పెట్టిన కేసులు ఏమాత్రం నిలబడే పరిస్థితి లేదన్నారు. ఇక మోదీ, చంద్రబాబు భేటీ పైన కీలక వ్యాఖ్యలు చేసిన ఉండవల్లి.. మోదీని కలిసి వచ్చాక చంద్రబాబు ముఖంలో ఉత్సాహం అయితే కపడలేదని అన్నారు.
అందుకు కారణాలు ఏంటంటే.. భేటీలో మోదీజీ చంద్రబాబు ముందు ఒక ప్రపోజల్ పెట్టారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటన్నీ బీజేపీకి ఇచ్చేసి.. అసెంబ్లీ సీట్లన్నీ తీసుకోవాల్సిందిగా చంద్రబాబుకు మోడీ ప్రపోజల్ పెట్టగా… దాని పై ఆలోచించి చెబుతానని చంద్రబాబు అన్నట్టు ఉండవల్లి వివరించారు. ఇక చంద్రబాబు చేస్తున్న అప్పుల వల్ల ఏపీ ప్రజల కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతోందని… ఇప్పటికే కర్నాటకలో కంటే ఏపీలో ఏడు రూపాయలు డీజిల్ ధర ఎక్కువగా ఉందంటే ఇదంతా అప్పుల ప్రభావమేనన్నారు ఉండవల్లి. చంద్రబాబు మాయచేయడానికి అలవాటు పడ్డారని.. ఒక సారి మాయ చేయడానికి అలవాటు పడ్డ తర్వాత పని చేయాలనిపించదని… ఇప్పుడు చంద్రబాబు కూడా అదే మాయలో ఉన్నారన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలు చేశారు.