రాష్ట్రంలోపెట్టుబడుల కోసం విదేశీ పర్యటనకు వెళ్లిన ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో వివిధ కంపెనీల ప్రతినిధులు, పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. హ్యుందాయ్ కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నామ్ గ్యూహ్ నోతోసమావేశమైన ఆయన టీఎస్ ఐపాస్, అనుమతులకు ఏకగవాక్ష విధానాలు, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో 300 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియాకు చెందిన యంగ్ వన్ సంస్థ
ముందుకొచ్చింది.
హ్యూందాయ్ రోటెం గ్లోబల్ రైల్ సంచాలకులు కేకే యూన్‌తోనూ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. రైల్వే ఉపకరణాల తయారీ, రక్షణ ఉత్పత్తుల్లో ఈ కంపెనీ కొరియాలో ప్రముఖమైనది. రాష్ట్రంలో, ప్రత్యేకించి హైదరాబాద్ లో రక్షణ పరిశ్రమకు ఉన్న అనుకూలతలను వివరించిన కేటీఆర్.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. కోఫోటి సంస్థ ఛైర్మన్ కిహుక్ సంగ్‌తో సమావేశమైన కేటీఆర్ ఆ కంపెనీ నెలకొల్పిన యంగ్ వన్ కార్పోరేషన్‌ను సందర్శించారు. మొబైల్ ఇంటర్నెట్ బిజినెస్ అసోసియేషన్‌కు చెందిన చోయ్ డాంగ్ జిన్‌ను కలిసిన కేటీఆర్… వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరగనున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌కు హాజరు కావాలని ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం, అసోసియేషన్ మధ్య ఆసక్తి వ్యక్తీకరణ ఒప్పందం కుదిరింది. మంత్రి కేటీఆర్‌తో పాటు ప్రభుత్వ సలహాదారు వివేక్, ఐటీ-పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ దక్షిణ కొరియాలో పర్యటనలో ఉన్నారు.
ఓసీఐ కంపెనీ లిమిటెడ్ సీఈవో వూ హ్యూన్ లీతో మంత్రి కేటీఆర్ చర్చలు జరిపారు. ఓసీఐ కెమికల్ కంపెనీ… ప్రపంచవ్యాప్తంగా 33 సెంటర్లలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. చైనా, జపాన్, యూఎస్, ఆసియా దేశాల్లో బ్రాంచులున్నాయి. ఈ నేపథ్యంలో ఓసీఐ సీఈవో కు.. తెలంగాణలో ఉన్న విస్తృత పెట్టుబడుల అవకాశాల గురించి వివరించారు కేటీఆర్. ముఖ్యంగా తెలంగాణలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ నెల 27వ తేదీ వరకు మంత్రి కేటీఆర్ బృందం విదేశాల్లో పర్యటించనుంది. దక్షిణ కొరియా, జపాన్, స్విట్జర్లాండ్లలో ఈ పర్యటన కొనసాగనుంది. గ్లోబల్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడంతో పాటు ఇతర అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలకు మంత్రి కేటీఆర్
హాజరుకానున్నారు.