తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లతో సమావేశం అయ్యారు. ప్రగతిభవన్ లో జరుగుతున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తో పాటు పలువురు మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, భూరికార్డుల ప్రక్షాళన, పంచాయితీరాజ్ ఎన్నికలు, పంచాయితీల విధులు, మునిసిపల్ చట్ట సవరణ తదితర అంశాలపై సీఎం దిశా నిర్దేశం చేశారు.
మార్చి 11వ తేదీ నుంచి పట్టాదార్ పాసు పుస్తకాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. దీనికోసం ప్రతి గ్రామంలో ఓ నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరినీ భాగస్వామ్యం చేయాలన్నారు. పట్టాదార్ పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందన్నారు సీఎం కేసీఆర్. పంపిణీకి ఒకరోజు ముందే పాసు పుస్తకాలను ఆయా గ్రామాలకు చేర్చాలని.. దీనికోసం ప్రత్యేకంగా వాహనం ఏర్పాటు చేయాలని సూచించారు.