తెలంగాణ రాష్ట్రంలో కాగజ్‌నగర్ పట్టణంలో గత మూడున్నరేండ్లుగా మూత పడిన సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్ధరణ ప్రక్రియలో వేగం పుంజుకుంది. ఈ మిల్లును తీసుకునేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తుండటంతో కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గతవారం జేకే పేపర్ మిల్లు ప్రతినిధులు మిల్లును సందర్శించి యంత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కర్ణాటకలోని దండెల్లి పేపర్ మిల్లు (వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్లు) ప్రతినిధులు ఈనెల 17, 18వ తేదీల్లో మిల్లును సందర్శించనున్నారు.
500 టన్నుల కాగితం ఉత్పత్తి చేసే యం త్రాలను వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్లు యజమాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో వారు ఈ మిల్లును తీసుకుని ఆ యంత్రాన్ని సిర్పూర్ పేపర్ మిల్లులో నెలకొల్పాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వారు కూడా మిల్లును తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు.
మిల్లును తీసుకునేందుకు తొమ్మిది కంపెనీలు తమ సీల్డ్ కవర్లను ఐఆర్‌పీ(ఇంటీరియం రిజల్యుషన్ ప్రొఫెషనల్స్)కు అందజేయగా జేకే, వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్లు యాజమాన్యాలు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నట్టు సమాచారం. ఐఆర్‌పీ సదరు సీల్డ్ కవర్లను ఫిబ్రవరి చివరి వారంలో తెరువనున్న నేపథ్యంలో ఆ లోగా మిగితా కంపెనీల ప్రతినిధులు సైతం సిర్పూర్ పేపర్ మిల్లును సందర్శించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది.