తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్నదాతల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో తొలిసారిగా వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌కు కసరత్తు చేస్తున్నది. సుమారు రూ.15 వేల కోట్ల వరకు కేటాయించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. రైతుల పెట్టుబడి (విత్తనాలు, ఎరువులు, కొంత మొత్తం కూలీలకు) కోసం ఎకరాకు రూ.4వేల చొప్పున వానకాలం, యాసంగిలో అందజేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.
ఈ పథకానికి ఏడాదికి రూ.11,370.26 కోట్లు అవసరమవుతాయని వ్యవసాయశాఖ ప్రాథమికంగా నిర్ధారించి, ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపినట్టు సమాచారం. వ్యవసాయానికి పెట్టుబడి మద్దతు పథకాన్ని మే 15 నుంచి అమలుచేయనున్నారు. రైతు సమగ్ర సర్వే ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.23 కోట్ల సాగుభూమి ఉన్నట్టు గుర్తించారు. పాత అంచనాల ప్రకారం 1.55 కోట్ల ఎకరాల సాగుభూమి ఉంది.
వ్యత్యాసం రావడంతో రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో భూప్రక్షాళన చేపట్టగా, 1,42,12,816 ఎకరాలు సాగు భూమి ఉందని వెల్లడైంది. దీని ప్రకారం పెట్టుబడి పథకానికి రూ.11, 370.26 కోట్లు అవసరమవుతాయని, ఒకవేళ మొత్తం 1.55 కోట్ల ఎకరాల సాగుభూమిని పరిగణనలోకి తీసుకుంటే రూ.12,400 కోట్లు అవసరమని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. వివాదాల్లేని భూముల లెక్కలు తేలితే కొంత మొత్తం పెరుగుతుందని భావిస్తున్నాయి.