తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది.అందులో భాగంగా రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండలం లింగంపల్లి ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లింగమ్మకు ఏడు వందల నలబై ఏడు ఓట్లు పోలవడంతో తన సమీప అభ్యర్థిపై నాలుగు వందల యాబై ఒక్క ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.ఇక రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని జన్వాడ ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి మల్లేశ్ గౌడ్ 561 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నాగేందర్‌పై గెలిచారు.నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురం, నిడమనూరు మండలం ఎర్రబెల్లి ఎంపీటీసీ స్థానాల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.
కిష్టాపురంలో 2152 ఓట్లకు 1233 ఓట్లు దక్కించుకున్న టీఆర్ఎస్ అభ్యర్థి కదెరె లింగయ్య 508 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి మునుకుంట్ల గోపాల్ గౌడ్ కు 725 ఓట్లు వచ్చాయి. బీజేపీ 131, టీడీపీ 29, నోటాకు 34 ఓట్లు దక్కాయి. ఎర్రబెల్లి స్థానంలో మొత్తం 2724 ఓట్లకు 2304 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి మన్నెం వెంకన్న యాదవ్ 1331 ఓట్లు సాధించి 563 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి సిద్దనూరు వెంకటేశ్వర్లు 768 ఓట్లు దక్కించుకున్నారు. టీడీపీ 147, నోటాకు 58 ఓట్లు వచ్చాయి.మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ మండలంలోని కన్మనూర్ ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గోవిందమ్మ 382 ఓట్లతో విజయం సాధించింది.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండల ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి స్వప్న 450 ఓట్ల మెజారిటీతో గెలిచింది.వనపర్తి జిల్లా గోపాల్ దిన్నె ఎంపీటీసీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిపై 491 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. భద్రాచలం ఎంపీటీసీ ఏడో స్థానానికి ఉప ఎన్నికలో సీపీఎం అభ్యర్థిపై 74 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. ఖమ్మం జిల్లా జక్కేపల్లి ఎంపీటీసీ ఉప ఎన్నికలో సీపీఎం అభ్యర్థిపై 228 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు.