అక్రమ ఏజెంట్ల పైన కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల శాఖా మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ మైగ్రేట్‌లో రిజిస్టర్ చేసుకునేందుకు ఎజెంట్లకు నెలరోజుల సమయం ఇవ్వాలని కోరుతూ నెల రోజుల్లోగా నమోదు చేసుకోని వారందరినీ అక్రమ ఏజెంట్లుగా గుర్తిస్తామని స్పష్టం చేశారు. ఎన్నారై శాఖపై మంత్రులు కే తారకరామారావు, నాయిని నరసింహారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు నాయిని, కేటీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రిజిస్టర్ చేసుకొని అక్రమ ఏజెంట్ల పైన కేసులు నమోదు చేయడంతోపాటు పదేపదే అక్రమాలకు పాల్పడుతున్న ఏజెంట్లు పైన పిడి పెట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అక్రమ ఎజెంట్లపైన చర్యలు తీసుకునే విషయంలో పోలీసులకు ప్రజలు సహకరించాలని మంత్రులు కోరారు. గల్ఫ్‌కు మహిళల అక్రమ రవాణాపైన మరింత కఠినంగా వ్యవహరించాలని పోలీసు శాఖను మంత్రులు ఆదేశించారు.
ఈ విషయంలో మైనార్టీ సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, ఎన్నారై శాఖ, పోలీస్ శాఖలు ఉమ్మడి బృందాల ఏర్పాటుతో ఈ ప్రత్యేకత వైపు కొనసాగుతుందని తెలిపారు.కాగా, హైదరాబాద్ లో విదేశీ భవన్‌కు ఫిబ్రవరి రెండోవారంలో శంకుస్థాపన చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రులు కోరారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నారైలకు, వలస కార్మికులకోసం చేపడుతున్న చర్యలను, ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలని మంత్రులు అధికారులకు సూచించారు.