ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్రలో ఇది ఒక తమాషా సన్నివేశం కావచ్చు.జగన్ తో చంద్రబాబు మాట్లాడారు.అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు కాదు. ఒక రైతు.ఆయన రైతులు ఎదుర్కుంటున్న కష్టాలను జగన్ కు వివరించడం విశేషం.చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగింది. ఎన్‌ఆర్ కమ్మపల్లి వద్ద వరినాట్లు వేస్తున్న యంత్రాన్ని జగన్ పరిశీలించారు. ఆ యంత్రం ద్వారా స్వయంగా నాట్లు వేశారు. ఈ సందర్భంగా రైతు చంద్రబాబు మాట్లాడారు. తన కష్టాలను ప్రతిపక్ష నేతకు చెప్పుకున్నారు. ‘‘అన్నా.. నేను రెండెకరాల్లో వరినాట్లు వేస్తున్నాను. ఎకరాకు రూ.24 వేలు ఖర్చవుతోంది. ఇంతకంటే తక్కువ ఖర్చుపెడితే దిగుబడి రాక గిట్టుబాటు కావడం లేదు. ఎకరానికి 35 మూటలు పండుతున్నా సరైన ధర దక్కకపోవడంతో నష్టపోతున్నాం. మమ్మల్ని అదుకునేలా పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి’’ అని విజ్ఞప్తి చేశారు. జగన్ స్పందిస్తూ… మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతాంగాన్ని అదుకుంటామని భరోసా ఇచ్చారు.తాను రైతుల కష్టాలను కళ్లారా చూస్తున్నానని జగన్ వ్యాఖ్యానించారు.రైతులకు గిట్టుబాటు ధరలకసం ఐదు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.
