సినిమా నటులంటేనే ప్రజలకు అదో అభిమానం. ఎందుకంటే సినీ నటులు తెరమీదే తప్ప.. ప్రత్యక్షంగా కనబడరనో.. లేక వారి నటన, గ్లామర్, వారి బాడీ లాంగ్వేజ్ కారణాలై ఉండొచ్చు. ఇక సినీ హీరోల అభిమానుల గురించి చెప్పనక్కర్లేదు. కుదిరితే గుడికట్టేస్తారు కూడా. అలాగే, తమ అభిమానులపై సినీ నటులు చూపించే ప్రేమ కూడా అలానే ఉంటుంది. వీరి మధ్య ఉన్నది సినీ సంబంధమే అనుకుంటే.. పొరపాటే.. అంతకు మించి సంబంధం ఉంటుందంటున్నారు సినీ జనాలు.
అయితే, సినీ ఇండస్ర్టీలో అభిమానులను కొట్టే హీరోలను చూశాం.. ప్రేమ ఇంకాస్త ఎక్కువైతే కౌగిలించుకుని ఆప్యాయంగా పలకరిస్తారు. అభిమానుల ప్రేమ మరీ ఎక్కువైతే చీదరించుకునే హీరోలనూ చూశాం.. కానీ అదే హీరో అభిమానుల కాళ్లు పట్టుకుంటే..! వినడానికే వింతగా ఉంది కదా..! అవునండీ మీరు చదివింది నిజమే. ఓ స్టార్ మీరో ఏకంగా అభిమానుల కాళ్లు పట్టుకున్నాడు. ఇంతకీ ఆ స్టార్ హీరో అభిమానుల కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందనేగా మీ డౌట్.
అసలు విషయానికొస్తే.. తమిళనాడులో ఇటీవల హీరో సూర్య నటించిన గ్యాంగ్ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ వేడుక ముగింపులో వేదికమీదకు వచ్చిన అభిమానులు కొందరు హీరో సూర్య కాళ్లు పట్టుకున్నారట.. వద్దు.. అలా చేయొద్దని ఎంత చెప్పినా వినకుండా అభిమానులు అలా చేయడంతో .. చిర్రెత్తుకొచ్చిన సూర్య కూడా.. అభిమానుల కాళ్లు పట్టుకున్నాడట. మీరు నా కాళ్లు పట్టుకుంటే.. నేను మీ కాళ్లు పట్టుకుంటానంటూ సమాధానం ఇచ్చాడట. అంతేకాకుండా వారితో కలిసి వేదికపై కాసేపు స్టెప్పులు కూడా వేశాడట హీరో సూర్య. నిజంగా ఇలాంటి హీరోను అభిమానించే సూర్య ఫ్యాన్స్ ధన్యులని చెప్పుకోవచ్చు.