సినీ నిర్మాత బండ్ల గణేశ్, అతడి సోదరుడు శివబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఏసీపీ సురేందర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా, షాద్‌నగర్ పట్టణానికి చెందిన డాక్టర్ దిలీప్‌చంద్రకు ఫరూఖ్‌నగర్ మండలం, బూర్గుల శివారులో భూములు, పౌల్ర్టీలు ఉన్నాయి. వాటిని బండ్ల గణేశ్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఆ ఆస్తులపై ఉన్న బ్యాంకు రుణాలను చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఒప్పందంలో భాగం. సరైన సమయంలో రుణాలు చెల్లించనందున బ్యాంకు అధికారులు ఆ భూములను,డాక్టర్ దిలీప్‌చంద్ర ఇంటిని సీజ్ చేశారని ఏసీపీ తెలిపారు. అనంతరం ఆ భూములను వారి ద్వారానే విక్రయించారన్నారు. తమకు రావాల్సిన డబ్బుల కోసం డాక్టర్ దిలీప్‌చంద్ర తన సతీమణి, కౌన్సిలర్ కృష్ణవేణితో కలిసి బూర్గుల శివారులో గల గణేష్ పౌల్ట్రీ ఫాం కార్యాలయానికి వెళ్లారు. తమను గణేశ్, శివబాబు దూషించారంటూ కౌన్సిలర్ కృష్ణవేణి ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు గణేశ్ సోదరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు ఏసీపీ తెలిపారు.
