మన దేశంలో భార్యా భర్తలంటే అర్థనారీశ్వరులని కొందరు చెబితే.. మరికొందరు ఒకరికొకరు కష్టాలను పంచుకుని తోడని, బిడ్డలే బ్రతకని అదే తమకు సుఖమనీ తలుస్తూ, శ్రమిస్తూ, తమిస్తే అదే పవిత్ర బంధమని చెప్పారు. ఇలా భార్యా భర్తల గురించి అనేక మంది కవులు అనేక నిర్వచనాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే, వాటన్నింటిని పటాపంచులు చేస్తూ.. కష్టాల సమయంలో సర్దుకుపోవాల్సిన భార్యా భర్తలు.. కొందరు.. సర్దుకుపోయేదెందుకు విడాకులు ఉన్నాయి కదా.. తీసేసుకుందాం.. అనే స్థాయికి వచ్చారు. అయితే, ఇటువంటి సంఘటనే హైదరాబాద్ నగరంలో ఒకటి చోటు చేసుకుంది.
ఇక అసలు విషయానికొస్తే.. భార్యా భర్తలు విడాకులు తీసుకోవడానికి చాలా కారణాలే ఉంటాయి. అయితే, అటువంటి కారణాల్లో తిండి అనే పదం ఎప్పుడైనా విన్నామా..? అంటే తిండి విషయంలో విడాకులు తీసుకోవడమన్నమాట. వినడానికే వింతగా ఉంది కదా..! అవును ఇటువంటి సంఘటనే చోటు చేసుకుంది.
హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడికి.. విశాఖలో నివాసం ఉంటున్న యువతితో గత నెలలో వివాహం అయింది. అయితే, వివాహానికి ముందు అమ్మాయి కాస్త లావుగా ఉందని ఆ యువకుడు ఎంత వారించిన.. తల్లిదండ్రుల ప్రోద్బలంతో ఆ యువకుడు యువతి మెడలో తాళికట్టక తప్పలేదు. ఇలా ఆ యువకుడు తనకు ఇష్టంలేని పెళ్లిని చేసుకోవాల్సి వచ్చింది.
ఈ విషయం తెలిసిన పెళ్లికూతురు. తన భర్త కోసమైనా లావు తగ్గాలని నిశ్చయించుకుంది. అలా అనుకున్నదే తడవుగా.. పచ్చికూరగాయలు తినేందుకు డిసైడ్ అయింది. అంతేగాక.. తనతోపాటు తన భర్త, అత్తకు కూడా పచ్చికూరలనే పెట్టేదట. ఇలా కోడలు పచ్చికూరలు తినడంతోపాటు.. తమకూ పచ్చికూరలు పెట్టడంతో భర్త, అత్త తీవ్ర ఆగ్రహానికి గురయ్యారట. నీవు తినడం వల్ల.. నీకు లాభం ఉంటుంది,, లావు తగ్గుతావు.. మేం తింటే లాభం ఉండదు కదా అంటూ భార్యపై చిరుబురులాడేవారట.
చివరకు కోడలితో తాము వేగలేమంటూ.. మీ కూతుర్ని భరించడం మా వల్ల కాదని.. వచ్చి తీసుకెళ్లండంటూ ఆమె తల్లిదండ్రులకు చెప్పారట భర్త అమ్మ. అయినా కూడా కోడలి తరుపు బంధువుల నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో చేసేదిలేక భర్త కోర్టును ఆశ్రయించాడట. అయితే, కోర్టులో భార్యభర్తలు ఇద్దరూ చెప్పిన విషయాలను విన్న జడ్జీ ఖంగుతిన్నాడట. భార్య ప్రవర్తన సరిగ్గా లేదని భర్త.. తనను అర్థం చేసుకోలేని వ్యక్తితో నేను జీవితాన్ని గడపలేనని భార్య ఇలా ఒకరిపై మరొకరు వాంగ్మూలం ఇచ్చుకున్నారు. ఇలా వారు కలిసి కాపురం చేసేది లేదంటూ తేల్చడంతో జడ్జీ వారికి విడాకులు మంజూరు చేశారు.