తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథాలకు మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫిదా అయ్యారు. దశాబ్దాల తరబడి తన నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుకు తన సొంత పార్టీ అయిన కాంగ్రెస్ కలగానే మిగులస్తుంటే..సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న టీఆర్ఎస్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చడంతో త్వరలో ఆయన టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. ఇదంతా అలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ గురించి.
సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం తుమ్మిళ్లలో రూ.783 కోట్ల రూపాయలతో చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం మొదటిదశ పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు.దశాబ్దాలుగా నీటికోసం వేచిచూస్తున్న ఆర్డీఎస్ రైతులకు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని ఏడు నెలల్లో పూర్తిచేసి వానకాలంనాటికి నీళ్లందిస్తామని ప్రకటించారు. సమైక్య రాష్ట్రంలో సాగునీటిపరంగా తెలంగాణకు జరిగిన అన్యాయానికి ఆర్డీఎస్ నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. ఆర్డీఎస్ గురించి ఇటీవలే కర్ణాటక ప్రభుత్వంతోనూ చర్చించామని, పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తిచేసేందుకు కర్ణాటక ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని వెల్లడించారు. కాంగ్రెస్ నేతలు గతంలో పదేండ్లపాటు తమ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల పనులు చేశామని చెప్పినా ఏ ఒక్క ప్రాజెక్టు నుంచి కూడా చుక్కనీరు పారించలేదని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌లో అంతర్మథనం మొదలైందని ప్రచారం జరుగుతోంది. ఇంత భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడమే కాకుండా..నిర్ణిత గడువుతో పూర్తి చేసేందుకు లక్ష్యాన్ని పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతివ్వడం తన బాధ్యతగా ఆయన భావిస్తున్నారని…ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే..కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు సంపత్‌ను వారిస్తున్నట్లు సమాచారం.