అమెరికాలో పనిచేస్తున్న భారత టెకీలకు భారీ ఊరట లభించింది. హెచ్-1బీ వీసాల పొడగింపు విధానంలో మార్పులు ఉండబోదని అమెరికా స్పష్టంచేసింది. హెచ్-1బీ వీసా పొడగింపు నిబంధనలను మరింత కఠినతరం చేసే యోచనలో అమెరికా ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. వీసాల పొడగింపుని నిలిపివేయడం ద్వారా అమెరికాలో పనిచేస్తున్న పలువురు ఐటీ నిపుణులను వారివారి స్వదేశాలకు తిప్పిపంపాలని శ్వేతసౌదం వర్గాలు భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో అక్కడుంటున్న దాదాపు 7.5 లక్షల మంది భారతీయులు దేశానికి వెనక్కి రావాల్సిన పరిస్థితి ఉత్పన్నం కావచ్చన్న కథనాలు వెలువడ్డాయి.
అయితే ఈ కథనాలను తోసిపుచ్చిన ట్రంప్ అధికార యంత్రాంగం, హెచ్-1బీ వీసాలపై తమ దేశంలో ఉంటున్న విదేశీయులను బలవంతంగా దేశం నుంచి బయటకు పంపే ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని అమెరికా ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ స్పష్టంచేసింది. ట్రంప్ సర్కార్ నిర్ణయంతో….భారత ఐటీ ఉద్యోగులకు భారీ ఉపశమనం లభించింది