వైసీపీ నేత అంబటి రాంబాబును ఏపీ పోలీసులు గృహనిర్బంధం చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అసలు మ్యాటర్ ఏంటంటే ఇటీవల ఒక చానల్ లైవ్‌లో వైసీపీ నేత అంబటి రాంబాబు.. టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చర్చకు పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఆ
లైవ్ డిబేట్‌లో బుద్దా వెంకన్న విసిరిన సవాల్‌ను స్వీకరించిన సత్తెనపల్లెకు వెళ్లేందుకు అంబటి రాంబాబు సిద్ధమవగా గుంటూరులోని ఆయన నివాసంలోనే పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.
చర్చ కార్యక్రమంలో పాల్గొన్న అంబటి … సత్తెనపల్లెలో అర్హులకు కూడా ఫించన్లు ఇవ్వడం లేదని చెప్పారు. దీంతో అందరికీ ఫించన్లు ఇస్తున్నామని.. కావాలంటే సత్తెనపల్లిలోనే బహిరంగ చర్చకు రావాలంటూ బుద్దా వెంకన్న అదే చానల్ చర్చలో సవాల్ చేశారు. ఈ సవాల్‌ను అంబటి రాంబాబు స్వీకరించారు. ఫించన్లు అందని బాధితులను తీసుకుని సత్తెనపల్లె వెళ్లేందుకు అంబటి రాంబాబు సిద్దమవగా.. పోలీసులు అడ్డుకున్నారు.
తాను బాధితులతో సహా సత్తెనపల్లెకు వెళ్తుండడంతో బహిరంగ చర్చ జరిగితే అసలు నిజాలు బయటకు వస్తాయనే టీడీపీ నేతలు పోలీసులు పంపించారని అంబటి మండిపడ్డారు. ఈ మాత్రం దానికి బహిరంగ సవాళ్లు చేయడం ఎందుకని టీడీపీ నేతలను ప్రశ్నించారు అంబటి. సవాల్ చేసిన తర్వాత దాన్ని ఎదుక్కొనే దమ్ము కూడా ఉండాలని టీడీపీ నేతలకు సూచించారు. బుద్దా వెంకన్న తాను గతంలో కలిసి కాంగ్రెస్‌లో పనిచేశామని… తాను ప్రజాస్వామ్య పద్దతిలోనే చర్చకు వెళ్తుంటే పోలీసులు
అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని అంబటి ప్రశ్నించారు.