తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి ఓ చీడ పురుగు అని రాష్ట్ర పరిశ్రమల, వౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీఎస్-ఐఐసీ) చైర్మన్ గ్యాదరి బాలమల్లు విమర్శించారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు వెళ్ళినా ఇంకా పరివర్తన రావడం లేదని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో సమైక్యవాదుల తరఫున పోరాడిన రేవంత్‌రెడ్డికి మంత్రి కేటీఆర్ పేరెత్తే అర్హత లేదన్నారు. రేవంత్‌రెడ్డి లాంటి చిల్లర నాయకుల హెచ్చరికలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని బాలమల్లు పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో చేరినా రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకం కావడంతో టీఆర్‌ఎస్ నేతలపై పూటకో ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర మంత్రి కె. తారక రామారావుపై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన విమర్శించారు. కేటీఆర్ తన పద్ధతి మార్చుకోకపోతే తన అభిమానులు చేతలకు దిగుతారని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బాలమల్లు తీవ్రంగా ప్రతిస్పందించారు. కేటీఆర్ జోలికి రేవంత్ వచ్చినా, ఆయన అభిమానులు వచ్చినా ఎలా బుద్ధి చెప్పాలో టీఆర్‌ఎస్ శ్రేణులకు తెలుసునని చైర్మన్ ఆయన హెచ్చరించారు