రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి ఫలిస్తోంది. విభజన చట్టం ప్రకారం దక్కాల్సిన స్టీల్ ప్లాంట్ కోసం ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నం ఫలితాన్ని ఇస్తోంది. ఇటీవలే కేంద్రమంత్రి బీరేంద్రసింగ్ ఏపీ, తెలంగాణ మంత్రులతో సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే ఏపీ కంటే ముందే… తెలంగాణ రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు మరో ముందడుగు పడింది.
మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంతో పాటు పొరుగునే ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఇనుప నిక్షేపాలున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అనువైన స్థలంలో ఉక్కు కర్మాగారం నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వ బృందం బయ్యారం ప్రాంతంలో పర్యటించింది. బయ్యారం ఇనుప రాతి గుట్టల సమీపంలో ఉన్న స్థలాన్ని పరిశీలించింది. కేంద్రబృందం ఆదివారం మహబూబాద్ జిల్లా పరిధిలోని బయ్యారం ప్రాంతంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉల్వనూరు, కిన్నెరసాని, లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి, లాలుతండా ప్రాంతాల్లోని భూములను పరిశీలించింది. కేంద్రం హామీ మేరకు రాంచీకి చెందిన మైకాన్ సంస్థకు చెందిన కొముతి రంజన్, ఆనంద్‌కుమార్, యూఎస్ రజాక్, శశిభూషణ్‌కుమార్‌తో కూడిన ప్రతినిధుల బృందం సభ్యులు బయ్యారంలో పర్యటించి ఇనుపరాతి గుట్టలు, అక్కడున్న స్థలాలకు సంబంధించిన మ్యాప్‌లను పరిశీలించారు.
ఈ సందర్భంగా స్థలంతోపాటు నీరు, రైలు మార్గాలకు సంబంధించిన అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా బయ్యారం మండలం ధర్మపురంలో భూమిని పరిశీలించారు. బయ్యారం పెద్ద చెరువును సందర్శించి నీటి లభ్యతను తెలుసుకున్నారు. బయ్యారం, గార్ల మధ్య రహదారులతోపాటు గార్లలో రైలు మార్గాన్ని, పరిశ్రమకు అవసరమైన విద్యుత్ కోసం అనంతాద్రిలోని సబ్‌స్టేషన్, కొత్తగూడెం జిల్లా పరిధిలోని కిన్నెరసానిలో స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన నీటి లభ్యతను పరిశీలించి సమగ్ర వివరాలను సేకరించారు.