ఐటీ పరిశ్రమను హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించేందుకు ఐటీశాఖ మంత్రి కే తారక రామారావు మరో ముందడుగు వేశారు. తెలంగాణ జిల్లాల్లోని యువతకు సైతం ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రంలోని కీలక జిల్లాకేంద్రాలకు ఐటీ పరిశ్రమను విస్తరిస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లాకేంద్రంలోని దిగువ మానేరు జలాశయం పరిధిలోని ఉజ్వల పార్క్ వద్ద రూ.25 కోట్లతో ఏర్పాటుచేయనున్న ఐటీ టవర్ నిర్మాణ పనులకు సోమవారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. పలు ఐటీ కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకోనున్నారు.అనంతరం జరిగే బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడనున్నారు. జీ ప్లస్ 5గా నిర్మించే ఈ టవర్‌లో మొదటి విడుతగా వెయ్యిమందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. దీనికి భూమి కేటాయింపులు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఐటీ హబ్ పనులు ప్రారంభమయ్యాయి. త్వరలో మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఐటీ సెంటర్లను ఏర్పాటుచేయనున్నట్టు మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో వెల్లడించారు.
ఐటీ టవర్ నిర్మాణ పనుల శంకుస్థాపన అనంతరం బహిరంగసభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతారు. తర్వాత జిల్లాకేంద్రంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కరీంనగర్ రెనోవేషన్ ప్రాజెక్టులో భాగంగా రూ.250 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించి వన్‌టౌన్ ఎదురుగా నిర్మించిన పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత కరీంనగర్ కార్పొరేషన్ కార్యాలయంలో సిటిజన్ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించి, కార్పొరేటర్లతో మాట్లాడుతారు. చౌరస్తాల పనుల ఆధునీకరణ పనులకు భూమిపూజ చేస్తారు.కేటీఆర్ రాక సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మంత్రికి ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. కరీంనగర్ జిల్లా పర్యటన అనంతరం మంత్రి రాజన్న-సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తారు. మధ్యాహ్నం మూడుగంటలకు ఈ జిల్లాలోని పెద్దూరు గ్రామం వద్ద డబుల్‌బెడ్‌రూం ఇండ్ల పనులకు శంకుస్థాపన చేస్తారు. సిరిసిల్లలో లైబ్రరీ భవనం, బార్ అసోసియేషన్ భవనాల పనులకు శంకుస్థాపన చేస్తారు. తదుపరి తంగళ్లపల్లి మండలంలోని శ్రీరాములపల్లి, జిల్లెల్ల గ్రామాల పరిధిలోని డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.