ఉద్యోగాలు ఆశించటం మాత్రమే కాకుండా . ఉద్యోగాలు కల్పించేలా యువత ఎదగాలని రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని దిగువ మానేరు జలాశయం పరిధిలోని ఉజ్వల పార్క్ వద్ద రూ. 25 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఐటీ టవర్ నిర్మాణానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ..ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్తోందని అన్నారు.. ఐటీ రంగంలో మూడేళ్లలోనే లక్ష వరకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు వచ్చాయన్నారు. రాష్ట్ర యువతకు పని చేసే చోటే ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్నామని చెప్పారు. కరీంనగర్ జిల్లా . తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రూ. 56 వేల కోట్ల ఐటీ ఎగుమతులు ఉన్నామయని మంత్రి గుర్తు చేశారు. గతేడాది ఐటీ ఎగుమతులు రూ. 87 వేల కోట్లకు చేరాయని తెలిపారు.
యువత ఉన్నతమైన, నవీన ఆవిష్కరణలు చేయాలని సూచించారు.యువతకు నాణ్యమైన శిక్షణ కల్పిస్తే ఉపాధి కల్పన సాధ్యమవుతుందని ప్రకటించారు. ఇప్పటికే వరంగల్‌లో ఐటీ హబ్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కరీంనగర్ ఐటీ పార్క్‌లో వెయ్యి ఐటీ ఉద్యోగాలు లభిస్తాయన్నారు. విద్యార్థులందరూ జాబ్ క్రియేటర్‌గా ఎదగాలన్నారు. కరీంనగర్‌లో త్వరలోనే టాస్క్‌ను నెలకొల్పుతామని కేటీఆర్ ప్రకటించారు. కేవలం మూడున్నరేళ్లలో దేశంలోనే సులభతర వాణిజ్యం సాధించిన రాష్ట్రంగా ఎదిగామని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వ పటిమ వల్లే అద్భుత ప్రగతి సాధ్యమైందని ఉద్ఘాటించారు. తెలంగాణ అభివృద్ధిని చూసి కేంద్రమంత్రులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ఉద్యమ నాయకుడు, పరిపాలన దక్షుడు కేసీఆర్ అంటూ అరుణ్ జైట్లీ కొనియాడారని గుర్తు చేశారు. నిన్ననే కేంద్ర మంత్రి మహేశ్ శర్మ కూడా సీఎం కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడు అని ప్రశంసించారని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే రాష్ట్రం సాధించుకున్నామని గుర్తు చేశారు. నీళ్లు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని చెప్పిన నాయకుడు సీఎం కేసీఆర్ అని తెలిపారు. త్వరలోనే ఇంటింటికి తాగునీరు అందివ్వబోతున్నామని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలన్నదే సీఎం లక్ష్యమని తేల్చిచెప్పారు.