ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జైలుకు పోవాల్సి వస్తుందేమో అని భయపడుతున్నారా ..? అంటే అవును అనే అంటున్నారు .సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ .ఒక ప్రముఖ టీవీ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ “ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తోకజాడిస్తే జైలుకెళ్లి చిప్పకూడు తినాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఓటుకు నోటు కేసును చేతిలో పట్టుకుని చంద్రబాబును.. మోడీ ఒక రింగ్ మాస్టర్‌లా ఆట ఆడిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మోడీకి వ్యతిరేకంగా తోక జాడిస్తే వెంటనే ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఆ విషయం చంద్రబాబు బాగా తెలుసు కాబట్టే బానిస బతుకు బతుకుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం చంద్రబాబుది ముమ్మాటికి బానిస బతుకేనని.. అందువల్లే కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమీ సాధించలేకపోతున్నారని విమర్శించారు.
మోడీ బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని నారాయణ విమర్శించారు. చంద్రబాబు నాయుడు చేసిన ఓటుకు నోటు పని రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. విజయవాడలో నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు. పోలవరం నిర్మాణం పై సీపీఐ బృందం నేరుగా ప్రధానిని కలిసిందని, ఆ పని టీడీపీ చేయలేకపోయిందన్నారు. బీజేపీ దిగజారుడు రాజకీయాల పై సోమవారం నుంచి జరిగే పార్టీ జాతీయ సమితి సమావేశాల్లో చర్చించి ముసాయిదాను ఖరారు చేస్తామన్నారు.