తెలుగుదేశం తెలంగాణ శాఖ అధ్యక్షులు ఎల్.రమణ చేసిన వ్యాఖ్యలకు సొంత పార్టీ నేతలే నవ్వుకుంటున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌భవన్‌లో టీడీపీ రాష్ట్రస్థాయి సాధారణ సమావేశం శనివారం జరిగింది. దీనికి అధ్యక్షత వహించి ఎల్.రమణ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లోగా పార్టీని రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా తయారుచేసుకుందామని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అన్ని స్థానాల్లో పోటీచేస్తుందని ప్రకటించారు. పల్లె పల్లెకు టీడీపీ కార్యక్రమం ద్వారా 119 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయడానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
టీడీపీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూనే, కేసీఆర్ సర్కారు వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. ప్రజాసమస్యలపై నిరంతర పోరాటాలు అవసరమన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు తన సహకారం ఉంటుం దని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ సమావేశానికి 500 మంది కిపైగా హాజరయ్యారంటేనే పార్టీ పట్ల అభిమానం ఇంకా ప్రజలు, నాయకులు, కార్యకర్తల్లో ఉందన్నారు.
కాగా, ఎన్నికల్లో పోటీ చేసే 119 స్థానాలకు కూడా అన్నిచోట్లా నాయకులు లేని పార్టీగా తీవ్రంగా దెబ్బతిన్న టీడీపీ…పోటీ చేయడం ద్వారా ఏం సాధిస్తుందని కామెంట్లు చేస్తున్నారు. అది కూడా పొరుగు రాష్ట్ర సీఎం అయిన టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతుతో…బరిలో నిలవడం ద్వారా తెలంగాణ ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వగలుగుతామని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలాఉండగా….పొలిట్‌బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసమే టీడీపీ పుట్టిందన్నారు. ఈనెల 11 ఏదా 12 తేదీల్లో పార్ల మెంటరీ నియోజకవర్గాలస్థాయిలో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు.