కనీస నిల్వలు లేవన్న సాకుతో బ్యాంకులు ఖాతా దారులను ఎడాపెడా వాయిచ్చేస్తున్నాయి. రెగ్యులర్ బిజినెస్‌లో సంపాదించే మొత్తాలకన్నా.. ఇలా కస్టమర్లపై వడ్డనతో బ్యాంకులకు వస్తున్న మొత్తాలే ఎక్కువ అన్నది ప్రస్తుతం జగమెరిగిన సత్యం. బ్యాంకులు ఒక్కసారిగా ఇలా ఖాతాదారులపై వడ్డనకు దిగడంతో కనీస నిల్వ లేదన్న కారణంగా.. ఖాతాదారుల నుంచి నగదును ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. దీంతో బ్యాంకులు పెడుతున్న టార్చర్ భరించలేక ఖాతాదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇందుకు సంబంధించి ఇంతకు ముందు ఖాతాదారు నుంచి వసూలు చేసిన మొత్తాలను.. గత ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో బ్యాంకులు వసూలు చేసిన మొత్తాలను పోల్చితే యాభై శాతం ఎక్కువని సర్వేలో తేలింది.
ఇక అసలు విషయానికొస్తే.. అందులో ఎస్బీఐ వాటానే ఎక్కువ ఉందట. కనీస నిల్వలు లేవన్న సాకుతో అన్ని బ్యాంకులు కలిసి తమ ఖాతాదారుల నుంచి దాదాపు రూ.2,320 కోట్ల రూపాయలను వసూలు చేసిందట. అందులో ఎస్బీఐ ఖాతాదారుల వాటా రూ.1,771 కోట్లుగా ఉంది. అందులోనూ 1581 కోట్లు గత ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో పెనాల్టీల రూపంలో ఎస్బీఐ తన ఖాతాదారుల నుంచి వసూలు చేయడం గమనార్హం.