తన విద్యార్హతల విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మరోమారు స్పందించారు. ఇప్పటికే తన కాలేజ్, సర్టిఫికెట్ గురించి స్పష్టత ఇచ్చానని పేర్కొంటూ అయినప్పటికీ కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే మంచిదని పేర్కొంటూ…ఆరోపణలు చేసే వారే పది మంది జర్నలిస్టుల ను సెలెక్ట్ చేస్తే గుల్బర్గా యూనివర్సిటీకి తీసుకు వెళ్లేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.
అలా తీసుకువెళ్లిన జర్నలిస్టులు నిజానిర్ధారణ చేయాలని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఒకవేళ తన పత్రాలు తప్పు అని తేలితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు. ఎన్నికల అఫిడవిట్ లో కూడా నిజాలే పేర్కొన్నానని, ఒకవేళ అందులో తప్పులు ఉంటే ఎన్నికల సంఘం చూసుకుంటుందని ఆయన అన్నారు. సంపత్ రావు తన క్లాస్ మెట్ కాదని తాను చదివేప్పుడు తమ లెక్చరర్ అని మంత్రి వివరించారు. జర్నలిస్ట్ కమిటిని ఎప్పుడు పంపినా తాను సిద్ధమని మంత్రి వెల్లడించారు. లేదంటే ఆరోపణలు చేసే వారు కానీ మీడియా కానీ మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించొద్దని ఆయన కోరారు.