తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ మరోమారు కాంగ్రెస్ తీరును బట్టబయలు చేశారు. ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ కాంగ్రెస్ తీరును ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇవ్వడాన్ని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తమ ఘనతగా ప్రచారం చేసుకోవడాన్ని పురస్కరిస్తూ ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. `తెలంగాణ ఏర్పడిన మొదటి ఏడాది పెద్ద ఎత్తున విద్యుత్ సమస్యలు ఎదురైతే…ప్రభుత్వం వైఫల్యం అని ప్రచారం చేశారు. ఇప్పుడు రైతులకు 24 గంటల కరెంటు ఇస్తుంటే…ఇది తమ ఘనత అని ప్రచారం చేసుకుంటున్నారు. ఇందులో మతలబు ఏంటి కేటీఆర్ సాబ్`అంటూ ప్రశ్నించారు.
దీనికి మంత్రి కేటీఆర్ ఒకింత ఘాటుగా స్పందించారు. ` కాంగ్రెస్ పార్టీ అనేది అవకాశవాదం, హిపోక్రసీ, నెగటివ్ పాలిటిక్స్ కలబోత. వాళ్లను అధికారానికి దూరంగా ఉంచాలి. ఐదు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు దేశాన్ని, రాష్ర్టాన్ని ఇలాంటి ఆలోచన దోరణితోనే పాలించారు. అయితే ఇప్పుడు ప్రజలు వారిని అధికారానికి దూరంగా పెట్టారు. భవిష్యత్‌లో కూడా అలాగే ఉంచుతారని ఆకాంక్షిస్తున్నాను` అని స్పందించారు.