ఐటీ రంగంలో తెలంగాణ తిరుగులేని శక్తిగా దూసుకుపోతోంది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ చొరవతో హైదరాబాద్ ఐటీకి కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఐటీ పరిశ్రమని రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించడంపై కేసీఆర్ ప్రభుత్వం సీరియస్ గా కృషి చేస్తోంది. స్థానిక విద్యార్థులకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో.. ఈ రంగాన్ని క్రమక్రమంగా జిల్లాలకు విస్తరిస్తున్నది. కరీంనగర్ కు ఐటీ హబ్ ను కేటాయించడమే అందుకు నిదర్శనం.
తాజా నిర్ణయంతో స్మార్ట్ సిటీ కరీంనగర్ ఐటీకి కేరాఫ్ గా మారనుంది. స్థానిక యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఐటీ హబ్ కు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశంలోనే తొలిసారిగా ప్లగ్ అండ్ ప్లే పద్దతిలో నిర్మిస్తున్న ఈ హబ్‌కు నేడు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. హబ్ ఏర్పాటుకు చొరవ చూపిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు కరీంనగర్ వాసులు మనసారా కృతజ్ఞతలు చెబుతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఐటీ హబ్ ను కేటాయిస్తూ.. ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు.. మంత్రి ఈటెల రాజేందర్ సారథ్యంలో ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ రంగంలోకి దిగారు. లోయర్ మానేరు డ్యాం దిగువన 53, 54, 55, 56 సర్వే నంబర్ల పరిధిలో మూడెకరాల స్థలాన్ని గుర్తించారు. గుర్తించిన స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ (టీఎస్ ఐఐసి) కి అప్పగిస్తూ, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా పంపించారు. కంపెనీలను ఆహ్వానించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి కేటీఆర్ అమెరికాకు వెళ్లనున్నారు.
కలెక్టర్ పంపిన నివేదికల ప్రకారం స్థలాన్ని స్వాధీనం చేసుకున్న టీఎస్ఐఐసి తన కార్యాచరణ మొదలు పెట్టింది. జీ ప్లస్ 5 పద్దతిలో టవర్ నిర్మాణం కోసం టెండర్ పిలిచింది. ఈ ప్రక్రియ పూర్తి కాగా, ఇప్పటికే ఐటీ టవర్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సిద్దం చేశారు. ఈ డిజైన్లకు సీఎం కేసీఅర్, ఐటీ మంత్రి కేటీఅర్ ఆమోదముద్ర వేశారు. ఐటీ టవర్ నిర్మాణానికి ఇప్పటికే 25 కోట్లు కేటాయించగా.. మొదటి విడతగా 12.50 కోట్లు విడుదలయ్యాయి. ప్రస్తుతం ప్లగ్ అండ్ ప్లే పద్దతిలో ఈ హబ్ ను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ ఐటీ టవర్లో వచ్చే కంపెనీలు, ఉపాధి అవకాశాలను పరిగణలోకి తీసుకొని దీనిని మరింత విస్తరించాలని యోచిస్తున్నది ప్రభుత్వం. కరీంనగరానికి ఐకాన్ గా ఉండేలా జీ+5 భవనాన్ని 3 ఎకరాల స్థలంలో, 50 వేల చదరపు అడుగుల వైశాల్యంతో 25 కోట్లతో నిర్మించనున్నారు. అత్యాధునిక హంగులతో, ప్లగ్ అండ్ ప్లే విధానంతో, నిరంతర విద్యుత్ సరఫరా, హైరేంజ్ వైఫై సేవలు, ఇతర సౌకర్యాలన్నీ ఈ టవర్లో కల్పించనున్నారు. ఉద్యమానికి అండగా నిలిచిన లక్షల మంది యువతీయువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ ఐటీ టవర్ ను ఏర్పాటు చేస్తున్నారు. అందుకే కరీంనగర్ కు ఐటీ టవర్ మంజూరు చేసిన సీఎం కేసీఅర్, మంత్రి కేటీఆర్ కు మనసారా ధన్యవాదాలు చెబుతున్నారు.