తెలంగాణ రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలులో నగరవాసులను భాగస్వామ్యం చేసేందుకు రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ‘మన నగరం’ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే! ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మంత్రి నేరుగా స్థానికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోవటంతో పాటు జరుగుతున్న అభివృద్ధిపై వారి అభిప్రాయాలను స్వీకరించి, అవసరమైతే మార్పులు, చేర్పులు కూడా చేస్తున్న ఈ ‘మన నగరం’ కార్యక్రమాన్ని గత నెల 16న కుత్బుల్లాపూర్ నిర్వహించగా, ఇవాళ మియాపూర్‌లోని విశ్వనాథ గార్డెన్స్‌లో మన నగరం కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. నగర అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయడమే మన నగరం కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ వేదిక ద్వారా సమస్యలు, పరిష్కారాలు చేసుకోవచ్చు. ప్రభుత్వ కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందన్నారు.జల సంరక్షణ కోసం జలం-జీవం కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని మంత్రి కేటీఆర్ ఈ సందర్బంగా ప్రకటించారు.
హైదరాబాద్‌లో కూడా నీటి కష్టాలున్నాయి. నీటి కష్టాలు రావొద్దనే ఉద్దేశంతో.. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ చట్టం చేసింది. దీనిపై నిబంధనలు కూడా వచ్చాయి. కానీ ఎవరూ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయడం లేదు. 300 స్కేర్ మీటర్ల స్థలంలో, ఆపైన నిర్మాణాలు చేపడితే ఇంకుడు గుంతలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చామని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ ఈ ఉత్తర్వులు అమలు కావడం లేదన్నారు. హైదరాబాద్ నగరంలో నిర్మాణాలు వేల సంఖ్యలో ఉన్నాయి. కానీ ఇంకుడు గుంతలు వందల సంఖ్యలో కూడా లేవని మంత్రి స్పష్టం చేశారు. ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రజల భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
రాబోయే 6 నెలల సమయంలో ఇంకుడు గుంతలు నిర్మించాలని కోరారు. ఆరు నెలల్లోపు ఇంకుడు గుంతలు పూర్తి కాకపోతే.. ఇంటి యజమాని, సంబంధిత అధికారిపై జరిమానా విధిస్తూ.. వారిద్దరిని బాధ్యులను చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.గతంలో హైదరాబాద్ జనాభా 15 నుంచి 20 శాతం ఉన్నది. ప్రస్తుతం హైదరాబాద్ జనాభా 30 శాతం ఉందని తెలిపారు. హైదరాబాద్ జనాభాతో పాటు వచ్చిపోయే వారితో కలిపి మొత్తం కోటి 25 లక్షల జనాభా ఉంది అని కేటీఆర్ పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా హైదరాబాద్‌ను అభివృద్ది చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వల్ల మంచినీటి సమస్యను పరిష్కరించగలిగామని తెలిపారు. గతంలో ఎండకాలం వచ్చిందంటే ఒకటి ఖాళీ కుండలు, బిందెల ప్రదర్శన జరిగేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మరొకటి విద్యుత్ కోతలు. విద్యుత్ కోతలు ఇప్పుడు లేనే లేవు. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. మంచినీటి సరఫరా మెరుగైనప్పటికీ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. రూ. 2 వేల కోట్ల నిధులతో మంచినీటి కార్యక్రమం చేస్తున్నాం. రూ. 3,100 కోట్లతో నగర శివారు ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను రాబోయే సంవత్సర కాలంలో చేపట్టబోతున్నామని తెలిపారు.