తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని పండగ చేస్తున్నదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ వరంగల్ జిల్లా పరిషత్ సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇవాళ జరిగిన జడ్పీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించింది. ఈ సందర్భంగా కడియం శ్రీహరి జడ్పీ సమావేశంలో మాట్లాడారు.విద్యుత్ సమస్యల పైన అసెంబ్లీలో, జడ్పీలో చర్చ జరుగకుండా ఉన్న సందర్భాలు తన రాజకీయ అనుభవంలో లేవని కడియం శ్రీహరి అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కోతల కరెంటు నుండి.. స్వరాష్ట్రంలో 24 గంటల విద్యుత్ అందించడం సీఎం కేసీఆర్ సమర్థతకు నిదర్శనం అని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 23 లక్షల పంపు సెట్లకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు.రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందిస్తున్నామని కడియం శ్రీహరి తెలిపారు. రైతులకు ఈ ఏడాది నుండి ప్రతి ఎకరాకు రెండు పంటలకు రూ. 8 వేలు పెట్టుబడి సాయం అందించనున్నామని చెప్పారు. పంటలకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం కేసీఆర్ చెప్పడం హర్షణీయం అన్నారు. రైతులు తమ మోటార్లకు ఉన్న ఆటోస్టార్టర్ లను స్వచ్ఛందంగా తొలగించి ప్రభుత్వానికి సహకరించాలని ఉప ముఖ్యమంత్రి శ్రీహరి కోరారు.ఈ సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి, జడ్పీటీసీలు, పాల్గొన్నారు.