ఆదివాసీల సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రభుత్వం ట్రైబల్ మ్యూజియం నిర్మిస్తోంది. ఆదివాసీల జీవనశైలికి అద్దం పట్టేలా ఇప్పటికే కొమురం భీం, భద్రాచలంలలో రెండు మ్యూజియంలను నిర్మించగా.. తాజాగా మేడారంలోనూ నిర్మిస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోనూ ట్రైబల్ మ్యూజియం నిర్మించాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని ఏటూరునాగారం ఐటీడీఏ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ప్రతిపాదనలు పంపగా పరిశీలించిన సీఎం కేసీఆర్ రూ.1.60కోట్లు మంజూరు చేస్తూ నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశారు. దీంతో టెండర్లు నిర్వహించి మ్యూజియం నిర్మాణ పనులను ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. కొద్ది నెలల క్రితం ప్రారంభమైన మ్యూజియం పనులు ప్రస్తుతం ఊపందుకున్నాయి. ఈనెల 15లోగా మ్యూజియం నిర్మాణ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు డెడ్‌లైన్ పెట్టారు.
నిర్మాణ పనులు పూర్తి కాగానే ఇప్పటికే సేకరించిన ఆదివాసీల సంస్కృతీ, సంప్రదాయాలు, జీవనశైలికి సంబంధించిన వస్తువులను మ్యూజియంలో అమర్చి ఈనెల మూడోవారంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభింపజేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఆదివాసీల ఆచార వ్యవహారాలతో పాటు సమ్మక్క, సారలమ్మ జననం నుంచి మొదలుకుని వీరమరణం పొందే వరకు జీవిత చరిత్ర పూర్తిగా మ్యూజియంలోకి ప్రవేశించగానే సందర్శకులు తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు.
ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, జీవన శైలికి సంబంధించిన వస్తువులను సేకరించి మ్యూజియంలో అమర్చేందుకు తాజాగా ప్రభుత్వం రూ.30లక్షలు మంజూరు చేసింది. ఈ నిధుల వినియోగానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్, వైస్ చైర్మన్‌గా ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ వ్యవహరిస్తారు. గిరిజన సాంస్కృతిక వ్యవహారాల విభాగం క్యూరేటర్, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, జీవన శైలి తెలిసిన ఆదివాసీ పెద్దలు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వస్తువుల సేకరణ కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.30లక్షల నుంచి జిల్లా కలెక్టర్ రూ.10లక్షలు క్యూరెటర్‌కు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, జీవన శైలికి సంబంధించిన వస్తువులను సేకరించటం, కొనుగోలు చేయటం ఇప్పటికే మొదలైంది.