తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. దేశంలోనే నెంబర్ వన్ సీఎం అని మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి అన్నారు . రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీనగర్ సాహెబ్‌నగర్‌లో మంచినీటి రిజర్వాయర్‌ను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంబించారు .ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ మల్లారెడ్డి ప్రసంగించారు. దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్, సీఎం కేసీఆర్ నెంబర్ వన్ అని మల్లారెడ్డి చెప్పారు. ఇంతలోనే మంత్రి కేటీఆర్ కలుగజేసుకొని.. దేశంలోనే ఎంపీ మల్లారెడ్డి కూడా నెంబర్ వన్ అని అన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. అనంతరం ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతూ.. నగరంలో తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. మార్చి తర్వాత ప్రతీ రోజు మంచి నీళ్లు వస్తాయన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకుపోతుందన్నారు. భారతదేశంలోనే నెంబర్ వన్ సిటీగా హైదరాబాద్ మారబోతుందని ఎంపీ మల్లారెడ్డి పేర్కొన్నారు.