తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇవాళ పలు అభివ్రద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసారు. దీనిలో భాగంగా ఎల్బీనగర్ సాహెబ్‌నగర్‌లో మంచినీటి రిజర్వాయర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు..
ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ..హైదరాబాద్ మహానగరంలో నీటి ఎద్దడి తీర్చేందుకు రూ. 2 వేల కోట్లతో తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సాహెబ్‌నగర్‌లో రిజర్వాయర్ల నిర్మాణం పూర్తవడానికి సమయం 2018 మార్చి అయినప్పటికీ.. మూడు నెలల ముందే పూర్తి చేసి తాగునీరు అందిస్తున్నామని స్పష్టం చేశారు.
ఎల్బీనగర్ సామాన్యమైన నేల కాదు. తొలి అమరుడు శ్రీకాంతాచారి ఇక్కడే ఆత్మహత్య చేసుకున్నాదాని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఎల్బీనగర్ త్యాగాల గడ్డ. ఈ ప్రాంతం నుంచే అద్భుతమైన ఉద్యమాలు జరిగాయి. ఈ గడ్డను సీఎం కేసీఆర్ ఎప్పటికీ మరిచిపోరని మంత్రి తెలిపారు. గతంలో ఎండకాలం వచ్చిందంటే ఖైరతాబాద్‌లోని జలమండలి ఆఫీసు ముందు ఖాళీ బిందెల ప్రదర్శన జరిగేది. ప్రభుత్వాలు భయపడే పరిస్థితి. మంచినీటి, కరెంట్ సమస్యతో ప్రజలు రోడ్డెక్కేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి.. రైతన్నలకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని గుర్తు చేశారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని కేటీఆర్ తెలిపారు. ప్రజలకు మేలు చేసే విషయంలో, అభివృద్ధి విషయంలో పార్టీలకతీతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు.మూసీని కూడా సుందరీకరిస్తామని మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు.