రాష్ట్ర కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. రాష్ట్రంలో శాసనసభ లో ప్రశ్నలు అడిగితే సాధారణంగా ప్రభుత్వం పారిపోతుందని… కానీ తెలంగాణలో విచిత్రంగా ప్రతిపక్ష నాయకులు పారిపోయారని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికలలో బాన్స్ వాడ నియోజకవర్గం నుండి టీడీపీ తరఫున పోటీ చేసిన భోజ్యా నాయక్, గాంధారి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తాన్ సింగ్(కాంగ్రెస్ పార్టీ)తో పాటు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
తెలంగాణ వచ్చాకే సేవాలాల్ ఉత్సవాలు అధికారికంగా జరిపామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మేడారం జాతరకు ఉపరాష్ట్రపతిని పిలిచామని పేర్కొంటూ..గతంలో ఎప్పుడైనా ఇలా పిలిచిరా అని నిలదీశారు. `70 ఎండ్లూ పాలించిన వారు ఎప్పుడైన గిట్ల చేశారా…70 ఎండ్లూ పాలించి అడ్డంగా బలసిర్రు..ఎక్కడైనా తండాకు నీళ్లు ఇచ్చారా` అంటూ నిలదీశారు. స్వయంగా రైతే రాజు ఉంటే అన్ని తెలుస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు.
`రాష్ట్రంలో ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి రైతు, సీఎం కేసీఆర్ రైతు… ఎకరానికి 4 వేలు ఇస్తా అన్న దమ్మున్న ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్. గతంలో కరెంట్ కోసం పోరాటాలు చేసేది..ఇప్పుడు మనం ఆటోమిటర్ స్టార్టర్ లు తీసేయిర్రి అని మనం బ్రతిమిలాడే స్థితికి వచ్చింది. ఇప్పుడు కొంత మంది మాట్లాడుతున్నారు కరెంట్ ఎడికెలి ఇస్తున్నారు అని. విత్తనాలు పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్మిన స్థితి మనం మర్చిపోయామా..సబ్ స్టేషన్లో ధర్నాలు చేసేవాళ్ళం…వాళ్ళ బాధ ఒక్కటే మీ పొలాలకు నీళ్లు వస్తే వాళ్ల కిందికి నీళ్లు వస్తాయి అని.` అని ఎద్దేవా చేశారు.
`రాష్ట్రంలో ఒకాయన గడ్డం తీయ అంటాడు…తియ్యకు ఎం అవుతుంది మంగలయన కు పని తప్పుతాది` అని మంత్రి కేటీఆర్ పంచ్ వేశారు. `గుజరాత్ లో ఏమైంది? హిమాచల్ ప్రదేశ్‌లో మీ పార్టీ అధికారంలో ఉండి కూడా మొన్న ఓడిపోయింది. ఆఖరికి రాహుల్ గాంధీ స్వంత నియోజకవర్గంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయారు. అయినప్పటికీ…వాళ్ళు ఆగం చేసుట్లో పీహెచ్‌డీ చేశారు` అంటూ ఎద్దేవా చేశారు.
ఇసుక మాఫియా విషయంలో మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. `సంచలనాల కోసం వార్తలు రాయవద్దు…చనిపోయిన సాయిలు వీఆర్ఏ కాదు. ఆయనను తొక్కి చంపారు అని మీడియా వక్రీకరిస్తోంది. ఆయనను ఇసుక ట్రాక్టర్ తో తొక్కి చంపలేదు…ఇటుక ట్రాక్టర్ కింద పడి చనిపోయాడు. మైనింగ్ విషయంలో మేం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. 10 సంవత్సరాల్లో రూ.40 కోట్లు ఆదాయం వస్తే మూడున్నర ఏండ్లలో 1000 కోట్లు ఆదాయం వచ్చింది. అలాంటి మీరా ఇసుక మాఫియా అంటూ మాటలు చెప్పేంది? ` అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.