ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడి పందేలపై ఉమ్మడి హైకోర్ట్ సీరియస్ అయ్యింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి పందేలు జరగకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్లను హైకోర్ట్ ఆదేశించింది. గతంలో నిబంధనలు ఉల్లంఘించిన 43 మంది తహశీల్దార్ల, 49 మంది ఎస్.హెచ్.ఓ లపై షోకాజ్ నోటీసులు జారీ చేశారని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని హైకోర్ట్ ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించి, ఎట్టి పరిస్థితుల్లో కోడి పందేలు నిర్వహించకుండా చూడాలని స్పష్టం చేసింది.తమ ఆదేశాలను ఉల్లంగిస్తే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , డీజీపీల పై చర్యలు తప్పవని హెచ్చరించింది.సంక్రాంతి పండుగ సందర్బంగా ఎక్కడైనా కోడి పందేలు జరుగుతుంటే.. అధికారులు కళ్ళు మూసుకొని ఏమీ జరగడం లేదని చెప్పవచ్చునని..అయితే న్యాయ స్థానాలు కళ్ళు మూసుకొని లేవన్న విషయాన్ని వారు గుర్తుపెట్టుకోవాలంది . కోడి పందేలపై పూర్తి నివేదికను ఈ నెల 22 కల్లా సమర్పించాలని హైకోర్ట్ ఏపీ సర్కారును ఆదేశించింది.