ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రలో రైతులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో జగన్‌ను కలిసేందుకు వస్తున్నారు.స్వచ్చందంగా జగన్ దగ్గరికి వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. గురువారం 52వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర కలికిరి నుంచి ప్రారంభమైంది. వైఎస్ జగన్ వెంట నడిచేందుకు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. వారందరితో కలిసి జననేత ముందుకు సాగారు. అక్కడి నుంచి అసిరెడ్డిగారిపల్లి, కొత్తపల్లి క్రాస్ మీదుగా కరెవాండ్లపల్లి క్రాస్ చేరుకున్నారు. తమ ఊరికి వచ్చిన రాజన్న తనయుడికి కరెవాండ్లపల్లి వాసులు ఘనస్వాగతం పలికారు. అంతేగాక పీలేరు కో–ఆప్షన్ సభ్యుడు హాబీబ్‌బాషా, ఎంపీపీ హరిత ఆధ్వర్యంలో 500 మంది మహిళలు వైసీపీ పార్టీ చిహ్నాలు కలిగిన చీరలు ధరించి గండబోయనపల్లె వద్ద జగన్ కి ఘన స్వాగతం పలికారు. పాదయాత్రలో వీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.