తెలంగాణ రాష్ట్రంలో పసుపు రైతుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత నిర్విరామంగా ప్రయత్నిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న ఆమె ఇవాళ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభును కలిశారు. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజక వర్గంలో స్పైస్ పార్క్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 42 ఎకరాల భూమిని కేటాయించి, రూ.30 కోట్లు మంజూరు చేసిందని కేంద్రమంత్రి సురేశ్ ప్రభుకు ఎంపి కవిత తెలిపారు.
స్పైస్ బోర్డ్ డీపీఆర్ సిద్ధం చేసిందని, పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. స్పందించిన మంత్రి సురేశ్ ప్రభు రాష్ట్ర ప్రభుత్వ నిధులకు తోడుగా కేంద్రం తరపున రూ. 20 కోట్లు ఇచ్చేందుకు సంసిద్దత వ్యక్తం చేశారు.పసుపు రైతులను ఆదుకునేందుకు ఎంపీ కవిత చేస్తున్న ప్రయత్నాలను ఈ సందర్భంగా కేంద్రమంత్రి అభినందించారు. కాగా, కేంద్రమంత్రి సురేష్ ప్రభు సూచన మేరకు వచ్చే నెల 3న స్పైస్ బోర్డ్ చైర్మన్, వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు హైదరాబాద్‌కు వస్తున్నారు. అదే రోజు హైదరాబాద్‌లో ఒక వర్క్ షాప్ నిర్వహిస్తారు. పసుపు పండించే రైతులు, పసుపును ఎగుమతి చేసే వ్యాపారులు, పసుపు పంటతో అనుబంధం ఉండేవారు వర్క్ షాప్‌కు హాజరవుతారు.
తెలంగాణలో పసుపు రైతులను ఆదుకునేందుకు స్పెషల్ టర్మరిక్ సెల్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ సెల్‌ను ఫిబ్రవరిలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభు ప్రారంభిస్తారు. ఈ సెల్ ద్వారా రైతులకు నాణ్యమైన పసుపు వంగడాలు, పంట చేతికి వచ్చిన తరువాత ప్రాసెస్ చేసేందుకు రైతులకు బాయిలర్‌లను అందజేసేందుకు నాబార్డ్ ను కోరతామని మంత్రి సురేష్ ప్రభు చెప్పారు.పసుపు రైతులకు మేలు చేసేందుకు పంటకు మంచి ధర వచ్చేలా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖతో సంప్రదించి సంయుక్తంగా కార్యాచరణ రూపొందిస్తామని ఎంపి కవితకు కేంద్రమంత్రి సురేశ్ ప్రభు హామీనిచ్చారు. పసుపు రైతులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన మంత్రి సురేశ్ ప్రభుకు ఎంపి కల్వకుంట్ల కవిత ధన్యవాదాలు చెప్పారు.