తెలంగాణ పారిశ్రామిక విధానం అద్భుతమని డెల్ ఎక్సెల్ ఫార్మా సీఈఓ రఘుపతి కందారపు కొనియాడారు. ఈ మేరకు పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుకు రఘుపతి బుధవారం సందేశం పంపారు. గతంలో వివిధ కంపెనీల్లో పని చేసిన రఘుపతి ప్రస్తుతం సొంతంగా పరిశ్రమను స్థాపించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ప్రభుత్వపరంగా, పారిశ్రామిక విధానం వల్ల తనకు కలిగిన అనుభవాలను మంత్రితో పంచుకున్నారు.తాను గతంలో 15 సంవత్సరాల పాటు అనేక కంపెనీల్లో ఫార్మా రీసెర్చ్ విభాగానికి హెడ్‌గా పని చేసినప్పటికీ తనకు ఇంతటి సులభమైన, పారదర్శకమైన అనుభవం ఎప్పుడు కలుగలేదన్నారు.
జూన్ 2016లో టీఎస్‌ఐపాస్ ద్వారా అనుమతులు పొందిన తాను, ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేసి డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులను కలిశానన్నారు. గతంతో పోలిస్తే డ్రగ్ లైసెన్స్ విధానం అత్యంత సులువుగా, పారదర్శకంగా ఉందని రఘుపతి గుర్తు చేసారు. డ్రగ్ లైసెన్సింగ్ విధానం నిజానికి క్లిష్టమైంది అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ఆన్‌లైన్ ప్రక్రియ అత్యంత సులభంగా ఉందని ఆయన కొనియాడారు. మంత్రి కేటీఆర్ పని తీరు తమకు స్ఫూర్తిదాయకంగా ఉందని ఆయన ప్రశంసించారు. మంత్రి కేటీ రామారావు వల్లనే ఇది సాధ్యం అవుతోందని, ఆయన పనితీరే తమకు స్ఫూర్తిగా నిలుస్తుందని అధికారులు తనకు తెలిపారని వెల్లడించారు.
ఇంతటి స్ఫూర్తివంతమైన మీ నాయకత్వానికి అభినందనలు అంటూ రఘుపతి మంత్రి కేటీఆర్ కు పంపిన సందేశంలో పేర్కోన్నారు.కేవలం మూడు సంవత్సరాల్లోనే తెలంగాణలో ఏర్పడిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రమాణాలు ఒక కలలా ఉన్నాయని రఘుపతి కందారపు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మార్పుకు కారణమైన ప్రభుత్వం ఇలాగే ముందుకు పోవాలని శుభాకాంక్షలు తెలిపారు. తమ కోసం, తెలంగాణ కోసం ఇలాంటి అద్భుతాలు ఇంకెన్నో చేయాలని ఆకాంక్షించారు.రఘుపతి కందారపు పంపిన సందేశానికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. పరిశ్రమల స్ధాపన, ఉద్యోగాల కల్పన చేయాలన్న తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇలాంటి ఫీడ్ బ్యాక్ స్ఫూర్తినిస్తుందన్నారు.