రాజన్న సిరిసిల్ల జిల్లాలో పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీశాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌తో కలిసి ఆకస్మిక పర్యటన చేశారు. తంగళ్లపల్లి మండలంలోని మండెపల్లి వద్ద నిర్మిస్తున్న డబుల్‌బెడ్ రూం ఇండ్లు, కోనరావుపేట మండలం మల్కపేట వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను పరిశీలించారు. ధర్మారం వద్ద నిర్మిస్తున్న భూగర్భ కాలువను సందర్శించి పనుల వివరాలను ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గడువులోగా భూగర్భ కాలువ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాణహిత చేవెళ్ల 9వ ప్యాకేజీ పనులు పూర్తయితే మెట్ట ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని, రెండు లక్షల ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యమని పునరుద్ఘాటించారు.
`గోదావరి జలాలతో మెట్ట ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. బీడు పడ్డ భూములు మళ్లీ ప్రాణం పోసుకుంటాయి. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 9వ ప్యాకేజీ పనులు గడువులోగా పూర్తి చేసి రైతుల కళ్లల్లో వెలుగులు చూడాలన్నదే నా ఆకాంక్ష’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. నీళ్లులేక బీళ్లుగా మారిన పొలాలు పచ్చని చేలతో కళకళలాడాలన్నదే ముఖ్య మంత్రి కేసీఆర్ సంకల్పమని, ఆయన కృషి ఫలితమే ఈ ప్రాజెక్టుల నిర్మాణమని గుర్తుచేశారు. అనంతరం మల్కపేట రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న భూములను పరిశీలించి, అక్కడి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మూడు టీఎంసీల నీటి నిలువ సామర్థ్యంతో నిర్మిస్తున్న మల్కపేట రిజర్వాయర్‌కు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులను కేటీఆర్ అభినందించారు. వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
నిర్వాసితులందరికీ న్యాయపరంగా రావాల్సిన పరిహారాన్ని అందజేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. నిర్వాసిత రైతు కుటుంబాల పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. చదువు లేని వారికి శిక్షణ ఇచ్చి తగిన విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని రైతులకు చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణాలకు స్వచ్ఛందంగా భూములు ఇచ్చి రైతులు, ప్రజలు సహకరించాలని కోరారు.