హైదరాబాద్‌లో విల్లాను తలపించే విధంగా పేదల డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్లా జిల్లాఓని తంగళ్లపల్లి మండలం మండెపల్లి వద్ద ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల ఆయన బుధవారం పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న మూడంతస్థుల భవనాలలోకి వెళ్లి కిచెన్, బెడ్ రూం, హాలు నిర్మాణాలను పరిశీలించి సంతృప్తి చెందారు.
జూన్ చివరి నాటికి నిర్మాణాలన్నీ పూర్తి కావాలని అధికారులను మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. సంపన్నులు కట్టుకునే విల్లా మాదిరిగా డబుల్ బెడ్ రూం ఇండ్లు ఉండాలని, అందుకు పార్కింగ్, పార్కులు, అంగన్‌వాడీ కేంద్రాలు, రోడ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, షాపింగ్ కాంప్లెక్స్ మొదలైన మౌలిక సౌకర్యాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు కేవలం రూ. 70వేలు మాత్రమే ఇచ్చారని, తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇంటికి రూ. 5.50లక్షల వరకు ఖర్చుపెడుతున్నట్లు తెలిపారు.
ఇంత మంచి లక్ష్యంతో పేదల కోసం నిర్మిస్తున్న ఇండ్లు నాణ్యతా ప్రమాణాలతో సంపన్నులుండే బంగ్లా మాదిరిగా నిర్మించాలని అధికారులకు గుర్తుచేశారు.
డబుల్ బెడ్ రూం ఇండ్ల్ల వరకు ఉన్న పీడబ్ల్యూడీ రోడ్డు వంకర టింకరగా ఉన్నందున సరి చేయాలని, అందుకు భూసేకరణ చేసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. అనంతరం అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల నత్తనడక, అధికారుల తీరుపై ఆగ్రహం చెందారు. మేలోగా పనులు పూర్తి చేసి ప్రారంభించేలా చూడాలని ఆదేశించారు. మంత్రి వెంట ఎంపీ బాల్క సుమన్, కలెక్టర్ కృష్ణభాస్కర్, డీఆర్వో శ్యాంప్రసాద్‌లాల్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, సెస్ చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి, వైస్‌చైర్మన్ శ్రీనివాస్, గూడూరి ప్రవీణ్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు భాస్కర్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.