తెలంగాణ విద్యాశాఖా మంత్రి, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు ప్రశంసలు గుప్పిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోకి వచ్చే మంత్రి సొంత ఊరు పర్వతగిరిలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు తన సొంత ఖర్చులతో ఆయన వారం రోజుల్లో కేజీబీవీకి సోలార్ ఫెన్సింగ్, గ్రౌండ్ లెవెలింగ్ తో పాటుగా…కలర్ టీవీ ఇస్తానని ప్రకటించారు. ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సమక్షంలో ఆయన ఈ ప్రకటన చేయడం పట్ల పలువురు ప్రశంసలు గుప్పిస్తున్నారు.
తాజాగా జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పర్వతగిరిలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు హెల్త్ కిట్స్ అందజేశారు. ఆడపిల్లలకు వచ్చే సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వపరంగా ఆదుకునేందురు రూ.300 విలువ చేసే హెల్త్ అండ్ హైజీన్ కలిగిన ఆరోగ్య పరిశుభ్రత కిట్స్ ను అందజేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలోని అన్ని హాస్టల్స్ లో వేడినీటిని అందజేస్తున్నామని చెప్పారు. గురుకులాలలో మంచి వసతులు కల్పించి ముందుకెళుతున్నామని చెప్పారు.
ఈ విద్యా సంవత్సరంలో 544 గురుకులాలను ప్రారంభించుకుని దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ విద్యలో నెంబర్ వన్ గా నిలిచిందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సంతోషం వ్యక్తం చేశారు. 840 గురుకులాలు, 194 మోడల్ స్కూల్స్, 296 కేజీబీవీలు, మొత్తం 1450 కి పైగా విద్యాలయాలలో 8 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని కడియం శ్రీహరి తెలిపారు. పర్వతగిరి తాను పుట్టిన గ్రామమని, అతిపేద కుటుంబంలో పుట్టిన తాను చదువుకుని అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తితో రిజర్వేషన్ లో ఈ స్థాయికి వచ్చానని
డిప్యూటీ సీఎం కడియం గుర్తుచేశారు.