తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో ఈ ఏడాది నీటి కొరత తీవ్రంగా ఉన్నందున తమ రాష్ట్రంలో తుంగభద్ర ఆయకట్టును కాపాడుకోవడానికిగా,తాగునీటి అవసరాలకు ఆర్.డి.ఎస్.లో తెలంగాణకు కేటాయించిన నీటిని వాడుకునేందుకు అనుమతించాలని తెలంగాణా ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావుకు కర్నాటక ఇరిగేషన్ మంత్రి పాటిల్ ఒక వినతిపత్రం సమర్పించారు. గురువారం ఇక్కడ జల్ల సౌధలో రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగాయి. తుంగభద్ర డ్యాం నుంచి తెలంగాణ కు 3.5 టి. ఎం.సి.ల నీటి వాటా ఉందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఆర్.డి.ఎస్.ఆయకట్టుకు అవసరమయ్యే నీటి వినియోగం పై, కర్ణాటకకు ఎంతమేరకు నీటి వాడకానికి అనుమతించగలమనే అంశాలపై తెలంగాణ, కర్నాటక ల మధ్య ప్రధానంగా చర్చసాగింది.ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 7 వేల ఎకరాల ఆరుతడి పంటలకు అవసరమైన సాగునీటి వాడకంపై రెండు రాష్ట్రాల ఇంజనీర్లు అంచనా వేసిన అనంతరం మిగిలిన నీటిని కర్నాటక వాడుకునే అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి హరీష్ రావు కర్ణాటక ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఈ అంశం పై ముఖ్యమంత్రి కెసిఆర్ తో చర్చించిన తర్వాత తమ నిర్ణయం చెబుతామని హరీష్ రావు చెప్పారు.
తుంగభద్ర నీటిని వాడుకున్నదానికి బదులుగా తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు కోరినా నారాయణపూర్ డ్యాం నుంచి జూరాలకు 2 టి.ఎం.సి.ల నీటిని విడుదల చేస్తామని కర్నాటక హామీ ఇచ్చింది. గత సంవత్సరం కూడా మహబూబ్ నగర్ జిల్లా తాగు నీటి అవసరాల కోసం తాము నారాయణ్ పూర్ నుంచి ఒక టి ఏం సి నీటిని జూరాలకు తెలంగాణ ప్రభుత్వం కోరిక మేరకు విడుదల చేసిన సంగతిని ఆయన గుర్తు చేసినారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో తెలంగాణ స్నేహ సంబంధాలు సాగిస్తున్నదని, కర్ణాటక గత ఏడాది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తాగు నీటి అవసరాక్లకోసం 1 టి.ఏం.సి. నీటిని విడుదల చేసిందని, ఇప్పుడు మళ్ళీ అదే రకమైన స్ఫూర్తిని చాటిన కర్ణాటక ప్రభుత్వానికి మంత్రి హరీష్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలంపూర్ నియోజక వర్గంలో ఉన్న పంటని కాపాడుకుంటూనే కర్ణాటక కు తుంగభద్ర నీటిని వాడుకునేందుకు అనుమతి ఇచ్చే విశయంలో తనకు అభ్యంతరం లేదని ఆలంపూర్ ఏం.ఎల్.ఏ సంపత్ అన్నారు.రాజోలిబండ డైవర్షన్ పథకం ఆధునీకరణ పనుల పై త్వరలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,కర్నాటక రాష్ట్రాల సమావేశం నిర్వహించాలని తెలంగాణ,కర్నాటక నిర్ణయించాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల ప్రాంతం రైతాంగానికి 8 7 వేల ఎకరాలకు సాగునీరందించవలసిన రాజోలి బండ డైవర్షన్ స్కీం నుంచి ప్రస్తుతం 20 వేల ఎకరాలకు కూడా సాగు నీరందడంలేదని మంత్రి హరీశ్ రావు చెప్పారు.
ఆర్.డి.ఎస్.ఆధునీకరణ పనులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేపట్టినప్పటికీ ఇప్పటిదాకా పూర్తి కాలేదన్నారు. ఆర్.డి.ఎస్. పనులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను కర్నాటకకు సమకూర్చుతుందని ఆయన తెలిపారు.ఆర్.డి.ఎస్.ఆధునీకరణ పనుల ప్రాధాన్యత గురించి ఇదివరకు తాను కర్నాటక ప్రభుత్వంతో జరిపిన చర్చలను మంత్రి గుర్తు చేశారు.ఈ ఆరు నెలల వర్కింగ్ సీజన్లో ఆర్.డి.ఎస్. ఆధునీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయవలసి ఉందన్నారు. అయితే ఏ.పి. సహకారం లేకుండా ఆర్.డి.ఎస్. ఆధునీకరణ పనులు పూర్తి కావని కర్నాటక ఇరిగేషన్ మంత్రి పాటిల్ అభిప్రాయ పడ్డారు. ఈ అంశంపై మూడు రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు, ఇరిగేషన్ కార్యదర్శులతో త్రైపాక్షిక సమావేశానికి తెలంగాణ చొరవ చూపాలని కర్నాటక చేసిన విజ్ఞప్తికి మంత్రి హరీశ్ రావు అంగీకరించారు.
ఏ.పి.ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో బుధవారమే తాను మాట్లాడానని, ఇరు రాష్ట్రాలు ఉమ్మడి ఇండెంట్ ను తుంగభద్ర బోర్డుకు పంపించడానికి అంగీకారంకుదిరిందన్నారు.త్రైపాక్షిక సమావేశానికి కూడా తాను దేవినేనితో మాట్లాడతానని హరీష్ తెలిపినారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు, , కర్నాటక ఇరిగేషన్ మంత్రి పాటిల్, విద్యా శాఖ మంత్రి తన్వీర్ షెట్,కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్, ఆలంపూర్ ఎం.ఎల్.ఏ. సంపత్ కుమార్, కర్నాటక ఎం.ఎల్.ఏ లు శివరాజ్ తంగిడి, అంపుల గౌడ , ప్రతాప్ గౌడ, అంపయ్య నాయక్, కే.సి.కొండయ్య, బోస్ రాజ్, టి.ఎస్.ప్రభుత్వ స్పెషల్ సి.ఎస్.జోషి, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాకేశ్ సింగ్ , డిప్యూటీ సెక్రెటరీ అనిల్ కుమార్, కర్నాటక జలవరుల విభాగం ఎం.డి. మల్లిఖార్జున గూంగే, ఇరిగేషన్ మంత్రి పి.ఎస్. వై.ఎస్. పాటిల్ , సి.ఇ.శంకర్ గౌడ్, ఇ.ఎన్.సి. మురళీధరరావు, సి.ఇ.ఖగేందర్ రావు,అంతర్ రాష్ట్ర జల వనరుల సి.ఇ.ఎస్. నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.