ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధినేత వైఎస్ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలోని కలికిరి వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ చెప్పిన పులి కద ఆసక్తికరంగా ఉంది. జగన్ తన పాదయాత్రలో రోజులు గడిచే కొద్ది కొత్త,కొత్త విషయాలతో ప్రజలను అలరించే యత్నం చేస్తున్నారు. జగన్ చెప్పిన పులి కద ఇలా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబును పరోక్షంగా పులిగా పోల్చుతూ, అది ఎంత ప్రమాదకరంగా మారిందో ఆయన వివరించే యత్నం చేశారు.జగన్ చెప్పిన పులి కద ఇలా ఉంది. ఆ కథ ఏమిటంటే ‘అనగనగా ఓ పెద్ద పులి. అది అడవిలో ఉండేది. అడవిలోని జంతువులను అది మోసం చేసేది. అబద్ధాలు చెప్పేది. చాలా దారుణంగా, క్రూరంగా ప్రవర్తించేది. ఎక్కడ బడితే అక్కడ ప్రజలను, జంతువులను విపరీతంగా తినేది. ఎవరినీ లక్ష్య పెట్టకుండా తన స్వార్ధం కోసం, కడుపు నిండటం కోసం ఎవరినైనా తినేసేది. ఆ పులి చేస్తున్న అన్యాయాలను, మోసాలను, హత్యలను తట్టుకోలేక అక్కడున్న ప్రజలు దాన్ని అడవిలో నుంచి తరిమేశారు.
ఇలా తొమ్మిదేళ్ల పాటు ఆ పులిని తరిమేశారు. ఇంచుమించి చంద్రబాబుని ప్రజలు ఏ విధంగా తొమ్మిదేళ్ల పాటు పదవి నుంచి తప్పించారో అలా. తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ఆ పులి అడవిలోకి వచ్చింది. అలా అడవిలోకి వచ్చిన పులిని ప్రజలు నమ్మలేదు. పులి వయసు కూడా పెరిగిపోయింది. ఇంచుమించుగా 70 ఏళ్లు వచ్చాయి. ఇక వేటాడే సామర్ధ్యం లేదని ఆ పులికి అర్థమైంది. అలా అర్థమైన మరుక్షణమే ఓ మనిషిని చంపేసి, అతని వద్ద ఉన్న బంగారు కంకణాన్ని తీసుకుంది. దాంతో ఊరి చివర ఉన్న చెరువు కట్టకు ఓ వైపు కూర్చుంది. దారిన పోయే వారితో అయ్యా నేను మారిపోయాను. నన్ను ఆదరించండి. ఇదిగో నా వద్ద బంగారు కడియం ఉంది. దీన్ని ముసలి వయసులో నేనేం చేసుకోవాలి. మీరే దీన్ని తీసుకోండి అని అనడం మొదలుపెట్టిందట. మొదట్లో ప్రజలు ఎవరూ పులిని నమ్మలేదు. కొంతకాలానికి పులిని చూసి చూసి.. దాని చేతిలో ఉన్న బంగారు కడియాన్ని చూసి ప్రజలకు ఆశ కలిగింది.
మారిపోయిందట కదా దగ్గరికి పోతే బంగారు కడియం ఇస్తుందేమో అని చెప్పి వెళ్లినవారందరినీ పులి తినేయడం మొదలుపెట్టింది. ఇంచుమించుగా ఇదే రీతిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నేను మారాను అని ప్రజలతో అన్నారు. ప్రజలంతా ఈయన నిజంగానే మారాడేమో అనుకున్నారు. అనుభవం ఉంది కదా అని ఓట్లేసి గెలిపించారు. ఆ తర్వాత చంద్రబాబు ఎవ్వరిని వదిలిపెట్టలేదు. తన చేతివాటం, తన పలుకుబడితో, తెలివితో,రాజకీయ అనుభవంతో రైతులు మొదలు అక్కచెల్లెమ్మలు, పిల్లలను కూడా వదల్లేదు. కులాల పరంగా మ్యానిఫెస్టో తెచ్చాడు. ప్రతి కులాన్ని మోసం చేసేందుకు ఒక్కొక్క పేజీ కేటాయించాడు. ఎవ్వరినీ వదలిపెట్టకుండా పూర్తిగా అన్యాయంగా తినేశాడు.’ అంటూ కథను ముగించారు వైఎస్ జగన్.