ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకులు,కార్యకర్తలతో పాటు మహిళలు,రైతులు, యువకులు పాదయాత్రలో జగన్‌ను కలిసి తమ సమస్యలు వివరిస్తున్నారు. అంతేగాక పలుచోట్ల ముఖాముఖి కార్యక్రమాన్ని జగన్ నిర్వహిస్తున్నారు. అయితే మదనపల్లికి చెందిన ఒక మహిళ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. తన ఇంటి చూట్టూ టీడీపీ వాళ్లే ఉంటారని.. 20 ఏళ్లుగా వారు ఎంత వేధించినా సింహంలా బతుకుతున్నానని ఆమె చెప్పారు. మీలాగే(జగన్) టీడీపీ వాళ్లతో పోరాడుతూ బతుకుతున్నానన్నారు.
టీడీపీ వాళ్లు ఎంత ఏడిపించినా తాను భయపడే వ్యక్తిని కాదన్నారు. చంద్రబాబు వచ్చాక ఒక్క ప్రభుత్వ పథకం కూడా తనకు ఇవ్వలేదని.. అయినా సరే దేవుడి దయతో బట్టలు కుట్టుతూ సొంతంగా బతుకుతున్నానని చెప్పారు. మాలాంటి పేదోళ్లంతా మీరు సీఎం కావాలని ఎదురుచూస్తున్నామని జగన్‌తో ఆమె చెప్పారు. వైఎస్ చనిపోయినప్పటి నుంచి బీదవాళ్లను పెద్దోళ్లు వెంటాడుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది ఆ మహిళ.
అలాగే చంద్రబాబు కొడుకు నారా లోకేష్ కు ఉద్యోగం వచ్చింది కాబట్టి అందరికీ ఉద్యోగం వచ్చినట్టేనని అనుకుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు. అయినా పేదోడికి సాయం చేయలేని సీఎం పదవి ఎందుకని చంద్రబాబును ప్రశ్నించారు. ఈసారి జగన్ సీఎం కావాలని తామంతా ఎందుకు చూస్తున్నామన్నారు. జగన్ సీఎం అవుతాడని తాను 10వేలు పందెం కట్టానని ఆమె చెప్పారు. జగన్ వచ్చి తమలాంటి పేదోళ్లను ఆదుకుంటాడన్న ఆశతో ఎదురుచూస్తున్నామని ఆమె చెప్పారు.