దుర్గగుడిలో తాంత్రిక పూజల్లో ముగ్గురు పూజారులను వన్‌టౌన్ పోలీసులు విచారించారు. ఈ విచారణలో భైరవి పూజ నిర్వహించినట్టు పూజారులు ఒప్పుకున్నట్లు సమాచారం. ఆలయ ప్రధాన అర్చకుడు బద్రీనాథ్ బంధువులు కలిసి భైరవి పూజ నిర్వహించినట్లు తెలుస్తోంది. ముగ్గురు పూజారులను విచారించిన వన్‌టౌన్ పోలీసులు కొత్త విషయాలు కనుగొన్నారు. పక్కా ప్రణాళికతోనే అర్ధరాత్రి పూజలు నిర్వహించినట్టు తెలుస్తోంది. మంగళవారం రాత్రి డిసెంబరు26 దుర్గామాతను పూజిస్తే శుభాలు జరుగుతాయనే విశ్వాసంతో ఉన్నతాధికారి ఆదేశాలతోనే సంప్రదాయాలకు విరుద్ధంగా పూజలు నిర్వహించినట్టు సమాచారం. అమ్మవారికి మహిషాసురమర్ధిని రూపంలో పూజలు చేసినట్లు నిందితులు పోలీసులకు వాగ్మూలం ఇచ్చారు. శాంతి స్వరూపంగా ఉండే దుర్గామాతకు ఆలయ ప్రధాన అర్చకుడు బద్రీనాథ్ బంధువులు భైరవి పూజ నిర్వహించినట్టు వెల్లడైంది.ఇదిలాఉంటే, ఈవో సూర్య కుమారి బదిలీకి అయ్యింది. ఆమె స్థానంలో చంద్రమోహన్ ను నియమించారు. ఇంకా ఈ పూజలు ఎవరి కోసం చేశారు..ఎందుకు చేశారు అనే దానిపై పూర్తి సమచారం త్వరలోనే తెలుస్తుంది.
