నిన్న మొన్నటి వరకు సమైక్య పాలనలో దగాపడ్డ జిల్లా పాలమూరు. తలాపున కృష్ణమ్మ పారుతున్నా.. గొంతెండిన పాలమూరు.. గత మూడేళ్లుగా ఎప్పుడూ లేని ప్రగతిని సాధిస్తోంది. ఒకప్పుడు పాలమూరును చూస్తే.. బీళ్లుగా మారిన పొలాలు.. నెర్రెలు బారిన నేలలు కనిపించేవి.. కానీ ప్రస్తుతం పాలమూరు అంటే వచ్చని పంటలు.. జలకళతో కళలాడుతున్న చెరువులు.. పండుగలా వ్యవసాయం.. పేదల జీవితానికి భరోసా.. ఇదీ తాజా వాస్తవ పరిస్థితి. ఇదంతా సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమయిందని జిల్లా ప్రజలు, రైతన్నలు చెబుతున్నారు.
సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో మంత్రి హరీష్‌రావు పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసే పనిని తన భూజాన వేసుకున్నారు. 2016, 2017 సంవత్సరాల్లో పాలమూరులో స్పష్టమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మంత్రి హరీష్‌రావు నిరంతర పర్యటనలు, సమీక్షలతో పాలమూరు జిల్లా జల విజయం సాధించింది. ప్రత్యేకంగా రోజూ వాట్సప్‌లో పాలమూరు ప్రాజెక్టు పనులను మానిటర్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సూచనలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల ద్వారా 8.78 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఆరు జిల్లాలకు వరప్రదాయినిగా మారబోతున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా పాలమూరు జిల్లాలో మరో 5.14 లక్షల ఎకరాలకు సాగునీరందబోతోంది. కోర్టు కేసుల వల్ల కొంత జాప్యం జరిగినా అనంతరం పనులు స్పీడందుకున్నాయి. 2016 వరకు అనధికారికంగా ఏటా 10 లక్షల మంది పాలమూరు మంచి వలస వెళ్తుండగా.. గతేడాది 20 శాతం వరకు వాపస్ వచ్చినట్టు రెవెన్యూ అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రాజెక్టుల పరిధిలోని ప్రాంతాల్లో రిజర్వాయర్లను నింపుతూ, ఇంకా అవకాశమున్న చెరువులు, కుంటలన్నిటినీ అలుగులు పారిస్తున్నారు. దాదాపు 500 చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. పెండింగ్ ప్రాజెక్టులను వినియోగంలోకి తీసుకురావడం ద్వారా 2016లో 5.50 లక్షల ఎకరాలకు సాగునీరందింది. 2018 ఖరీఫ్ నాటికి మిగిలిన పెండింగ్ పనులను పూర్తి చేసే దిశగా మరింత వేగవంతమవుతున్నాయి.
మంత్రి హరీష్ పలుమార్లు ఆకస్మికంగా కల్వకుర్తి ప్రాజెక్టు పనుల ప్రగతిని పరిశీలించారు. గుడిపల్లిలో లిఫ్ట్ ద్వారా పంపహౌజ్‌లోకి దిగారు. స్వయంగా పనుల స్థాయిని గమనించారు. పనుల్లో వేగం పెంచి, కల్వకుర్తి ప్రాంత రైతులకు సాగునీరు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. గుడిపల్లి మంచి బిజినేపల్లి, తిమ్మాజిపేట మీదుగా కల్వకుర్తి వరకు ఉన్న కాల్వల తీరు, స్టక్చర్లు బ్రిడ్జిల పనులను పరిశీలించారు.
పాలమూరు అంటే వలసలు. బీడుబడ్డ పొలాలు నెర్రెలు వారిన చెరువులు.. ఆత్మహత్యలు.. ఆగమైన కుటుంబాలు.. ఇది ఒకప్పటి బతుకు చిత్రం. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ సారథ్యంలో జిల్లా ముఖచిత్రం సమూలంగా మారుతున్నది. కృష్ణా జలాలతో రైతుల కాళ్లు కడుగుతామన్న మాట ప్రకారం ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నది. జూరాల కింద ఒక లక్ష ఎకరాలు, జూరాల కాలువలపై రైతులు బిగించిన వంపు సెట్ల ద్వారా సాగవుతున్న భూమి సుమారు 30 వేల ఎకరాలు సాగయ్యాయి.
తుమ్మిళ్ల లిఫ్ట్ పథకంతో ఆర్డీఎస్ కింద ఆయకట్ట స్థిరీకరణకు చర్యలు చేపడుతున్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ కింద 4.5 లక్షల ఎకరాలు నికరంగా సాగయ్యాయి. కృష్ణా ప్రాజెక్టుల్లోకి నీరు వస్తే 2018లో మరో 2.5 లక్షల ఎకరాలకు అంటే మొత్తం 9 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి కాల్వలు సిద్ధంగా ఉన్నాయి. మిషన్ కాకతీయలో చెరువులను బాగుచేసుకోవడంతో చెరువుల్లో, కాల్వల్లోకి నీరు వచ్చి జిల్లాలో సామాజిక, ఆర్థిక మార్పు కనబడుతున్నది. గత ప్రభుత్వం ప్రారంభించిన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి, గత ప్రభుత్వం ఆమోదించి అటకెక్కించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయ్యాలని కూడా ప్రభుత్వం సంకల్పించింది. అందుకు నిధుల కొరత లేకుండా చూస్తున్నది. ప్రాజెక్టును అడ్డుకునే ప్రత్యర్థుల కుటిల పన్నాగాలను తిప్పికొట్టి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల సాగునీటి ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం నిరవధికంగా కృషి చేస్తున్నది.
సీఎం కేసీఆర్ కల అయిన కోటిఎకరాల మాగాణి కోసం సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో హరీష్‌రావు ముందుకు సాగుతున్నారు. కాంట్రాక్టర్లకు టార్గెట్లను ఖరారు చేసి పనులను వేగవంతం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఏ నాటికీ కల్వకుర్తి ప్రాజెక్టు పూర్తయ్యేది కాదు. కల్వకుర్తి ప్రాజెక్టుకు ఏ ప్రభుత్వం ఖర్చు చేయనన్ని నిధులు టీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. మూడేండ్లలోనే 1,300 కోట్లు కల్వకుర్తి ప్రాజెక్టు కోసం ఖర్చు చేసి శరవేగంగా పూర్తి చేస్తోంది.