అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుంటే, ఆయా పథకాలను, ప్రాజెక్టులను అడ్డుకుంటూ అభివృద్ధి నిరోధకంగా కాంగ్రెస్ పార్టీ మారిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని సమంగా నడిపిస్తున్నారన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణ పాలిట శాపంగా మారిందన్నారు. అడుగడుగునా అభివృద్ధికి అడ్డుపడుతున్న కాంగ్రెస్ పార్టీని గ్రామాల్లో లేకుండా తన్ని తరమండని మంత్రి పిలుపునిచ్చారు. కుచరకల్‌లో మంత్రి లక్ష్మారెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఎస్సీ, బీసీ కమ్యూనిటీ హాలు నిర్మాణాలకు భూమిపూజ, కస్తూర్బా స్కూల్‌కి ప్రారంభోత్సవం, సావిత్రి బాయి ఫూలే జయంతి ఉత్సవాలలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు
అనంతరం మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజాభివృద్ధికి పాటుపడుతుంటే కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతున్నదని ఆరోపించారు. కొత్తగా వచ్చిన తెలంగాణ తెర్లు కాకుండా, జనాభివృద్ధి ఎజెండాగా సీఎం కెసిఆర్ అనేక పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నారన్నారు. వలస జిల్లాగా పేరుపడిన పాలమూరు ప్రాజెక్టులను, భూసేకరణను, నిరుపేదలకు అందిస్తున్న రెండు గదుల ఇండ్లను, చివరకు విద్యార్థుల చదివి డాక్టర్లు అయి ప్రజలకు సేవ చేసేందుకు వీలుగా ఏర్పాటు చేసిన మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీల భూములను… ఇలా అనేకంగా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఎక్కడైనా పార్టీలు ప్రజల బాగోగుల కోసం పాటుపడతాయి. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయి. కానీ, తెలంగాణలో కాంగ్రెస్ మాత్రం అత్యంత దారుణంగా ప్రజల అభివృద్ధికి అడ్డుపడుతూ దగా చేస్తున్నదని ఆరోపించారు. ఇలాంటి పార్టీలను గ్రామాల్లో నామరూపాలు లేకుండా తన్నితరిమి కొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు.
జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వంటి మహానుభావులు చూపిన దారిలో తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్నదని మంత్రి అన్నారు. విద్యా, వైద్యం మీద ఎనలేని శ్రద్ధ వహిస్తున్నామన్నారు. జిల్లాకు రెండు రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని, విద్యార్థుల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా మరుగుదొడ్ల నిర్మాణం, ప్రహారీ గోడలు, నూతన భవనాలు, అనేక స్కూల్స్, విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం, బోధన అందిస్తున్నామన్నారు. వైద్యం విషయంలో ఒక నూతన ఒరవడిని సృష్టించామని, ఆరోగ్య తెలంగాణ దిశగా అన్ని చర్యలూ చేపట్టామని చెప్పారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటల పాటూ విద్యుత్‌ని అందిస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. త్వరలోనే వచ్చే పంటల కాలం నుంచి ఏడాదికి రెండు పంటలకు ప్రతి రైతుకు ఎకరాకు రూ.4వేల చొప్పున అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇలాంటి పథకం కూడా ఎక్కడా లేదన్నారు. రైతే రాజని దగా చేసిన గత అనుభవాల నుంచి అద్భుతమైన పథకాలను రూపొందించామన్నారు. ఇక మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన మంచినీరు నల్లాల ద్వారా ఇంటింటికీ అందించే కార్యక్రమం త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు. ఈ నీటితో ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్నారు. ఇక తెలంగాణ గ్రామీణ సమాజంపై ఉన్న అవగాహనతో సీఎం కెసిఆర్, గొర్రెల పెంపకం, చేపల పెంపకం, చేనేతలకు చేయూత, బీసీల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపకల్పనకు నాందీ పలికిన ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కెసిఆర్‌కి దక్కుతుందన్నారు. ఇలాంటి పార్టీలకు, ప్రభుత్వాలకు అండగా నిలవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
బాలానగర్ మండలంలోని పలు గ్రామాల నుంచి కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు టిఆర్ఎస్ లో చేరారు. వారికి మంత్రి లక్ష్మారెడ్డి గులాబీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. కుచరకల్ లో 50 మంది, ఖానాపూర్‌లో 17 మంది, గౌతాపూర్ సర్పంచ్ చంద్రయ్య నేతృత్వంలో 50 మంది కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. తాము కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం, మంత్రి లక్ష్మారెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై, ప్రగతిలో భాగస్వాములమవ్వాలనే లక్ష్యంతో టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు వారు ప్రకటించారు.