వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం(ఎస్‌ఆర్‌డీపీ) తొలి దశ పనుల్లో భాగంగా అయ్యప్ప సొసైటీ చౌరస్తాలో 450 మీటర్ల పొడవైన అండర్ పాస్‌ను మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, పట్నం మహేందర్‌రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీ, పురపాలక శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ విమర్శకులకు పంచ్ వేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ప్రస్తావించారు.
అత్యుత్తమ జీవన ప్రమాణాలు గల నగరంగా దేశం లో హైదరాబాద్ నెంబర్ వన్ గా నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. 23వేల కోట్ల రూపాయలతో ఎస్ఆర్‌డీపీ పనులు జరుగుతున్నాయని అన్నారు. 2900 కోట్ల తో కొత్త మార్గాల అభివృద్ధి, 1000 కోట్ల రూపాయల తో గ్రేటర్ హైదరాబాద్ రోడ్లు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. జేబీఎస్ నుంచి రాజీవ్ రహదారి వరకు, ఫ్యాట్నీ నుంచి బోయిన్ పల్లి వరకు స్కై వే లు ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు స్కై వే నిర్మాణ దశలో ఉందన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం తాము పనులు చేస్తుంటే…గతంలో ఇవాంక కోసం హైదరాబాద్ ను అందంగా చేసామని అన్నారని…ఇప్పుడు ఏ ట్రంప్ రావడం లేదని..అయినా అండర్ పాస్ వంటి ఎస్ఆర్‌డీపీ ప్రాజెక్టు లు చేస్తున్నామని…విమర్శించే వారు ఇది గమనించాలని కోరారు.
ఈ అండర్ పాస్‌ను పూర్తి చేయడానికి 12 నెలల సమయం ఉన్నప్పటికీ 9 నెలల్లోపే పూర్తి చేయడం జరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎస్‌ఆర్‌డీపీని నాలుగు దశల్లో అమలు చేస్తున్నామని చెప్పారు. 110 కిలోమీటర్ల ఎలివేటర్ కారిడార్ నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నామన్నారు. మైండ్‌స్పేస్ వద్ద నిర్మాణంలో ఉన్న అండర్ పాస్ మార్చి వరకు పూర్తవుతుందన్నారు. మైండ్‌స్పేస్ జంక్షన్‌లో వచ్చే ఏడాది జూన్ నాటికి ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.