రాబోయే ఎనిమిది నెలల కాలం ఇరిగేషన్ శాఖకు అత్యంత కీలకమని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతి గంట విలువైనదని, నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని మంత్రి కోరారు.తెలంగాణ నీటిపారుదల శాఖ 2018 క్యాలెండర్ ను మంత్రి బుధవారం నాడు జలసౌధలో ఆవిష్కరించారు.పదహారు నెలల్లో చేయవలసిన పనులను ఎనిమిది నెలల్లో చేయడానికి ఇరిగేషన్ అధికారయంత్రాంగం నడుం బిగించాలని కోరారు.గడచిన మూడున్నరేళ్లుగా అంకితభావంతో పనిచేస్తున్న ఇంజనీర్లు ఈ ఏడాది ఇంకా పట్టుదలతో పని చేయాలని కోరారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సాగునీళ్లొస్తాయని,ప్రాజెక్టులు పూర్తవుతాయని ప్రజలు భావించారని అన్నారు.ప్రజల్ని, రైతులను డిసప్పాయింట్ చేయొద్దని చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టవలసిన బాధ్యత ప్రతి ఇంజనీరుకు ఉన్నట్టు హరీష్ రావు అభిప్రాయపడ్డారు.
ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఇంత విస్తృతంగా,సంపూర్ణంగా అవగాహన ఉన్న సి.ఏం దేశంలో మరెవరూ లేరని మంత్రి అన్నారు.భవిష్యత్తులో కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులను నిర్మించే అవసరం, అవకాశం రాదనీ కాళేశ్వరం ప్రాజెక్టులో పనులు జరుగుతున్న వేగాన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా ప్రాజెక్టులలోనూ వేగవంతం చేయాల్ని హరీష్ రావు సూచించారు.లక్షలాదిమంది రైతుల జీవితాల్లో వెలుగు నింపే జల సంకల్పంలో భాగస్వాములైనందుకు ప్రస్తుత ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లంతా గర్వపడాలని అభిప్రాయపడ్డారు.ఒక ఉద్యోగం వలె కాకుండా సామాజిక బాధ్యతగా డ్యూటీ చేయాలని కోరారు.ఈ ఎనిమిది మాసాలు వీలైననతవరకు సెలవులు, పండుగదినాల వంటి రోజుల్లోనూ పని చేసి జిల్లాల వారీగా, ప్రాజెక్టుల వారీగా టార్గెట్లను పూర్తి చేయాలని ఇంజనీర్లకు మంత్రి విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును పర్యటించిన తర్వాత ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ పై ప్రజల్లో విశ్వాసం కనిపిస్తోందని మంత్రి అన్నారు.మూడు బ్యారేజీలు, మూడు పంపు హౌజ్ ల పనులు అత్యంత వేగంగా జరుగుతుండడం పట్ల ఇరిగేషన్ అధికార యంత్రాంగంలోనూ ఆత్మ విశ్వాసం పెరిగిందన్నారు.
ఇరిగేషన్, రెవెన్యూ,అటవీ శాఖల అధికారులు సమిష్టిగా,సమన్వయంతో పని చేయడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు లో భూసేకరణ ప్రక్రియ పూర్తయైందని అన్నారు. అటవీ సంబంధిత సమస్యలు పరిష్కారమైనట్లు చెప్పారు.8 వేల ఎకరాల భూసేకరణ జరిగిందని గుర్తు చేశారు.16 జిల్లాల్లో కాళేశ్వరం పై ప్రజాభిప్రాయసేకరణ సజావుగా సాగిందన్నారు.సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సి.డి.ఓ) విభాగం సిబ్బంది రేయింబవళ్లు డిజైన్ల రూపకల్పనలో పని చేశారని హరీశ్ రావు ప్రశంసించారు.సెలవులు, పండుగల సమయాల్లో కూడా పనిచేయడం వల్ల అనుకుకున్న సమయానికి డిజైన్లు పూర్తి చేయగలిగినట్టు మంత్రి చెప్పారు.టి.ఆర్.ఎస్.ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి రెండేళ్ళు మిషన్ కాకతీయ కార్యక్రమం వల్ల, మైనర్ ఇరిగేషన్ విభాగంలో జరిగిన పనుల వల్ల మంచి పేరు వచ్చిందన్నారు.గత సంవత్సరం 382 మండి ఏ.ఈ.ఈ. లను ఇరిగేషన్ శాఖలో నియమించామని,ఈ సంవత్సరం మరో 312 మంది ఏ.ఈ.ఈ. లను అప్పాయింట్ చేస్తున్నట్టు మంత్రి హరీష్ రావు తెలియజేశారు.తొలి ఏడాదిన్నర కాలం కొత్త రాష్ట్రం బాలారిష్టాలను ఎదుర్కున్నదని గుర్తు చేశారు.2019 లో ఎన్నికలు జరగనున్నందున సాగునీటి పథకాలకు సంబంధించి 2018 కీలకమని అన్నారు.ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జోషీ ఒక్కోసారి టైపీస్టుగా, సెక్షన్ క్లర్క్ గా కూడా అవతారం ఎత్తి పనిచేసుకు పోతున్నారని, ఎలాంటి అహం లేకుండా స్పెషల్ సి.ఎస్. చేస్తున్న పనితీరును ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి కోరారు.ప్రభుత్వ స్పెషల్ సి.ఎస్. జోషి, ఇరిగేషన్ ఈ.ఎన్.సి.లు మురళీధరరావు, నాగేందర్ రావు, అనిల్, లిఫ్ట్ పథకాల సలహాదారు పెంటారెడ్డి, పలువురు సి.ఈ.లు, ఎస్.ఈ.లు,ఇతర సిబ్బంది పాల్గొన్నారు.