ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తాను చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. సమస్యలకు పరిష్కార మార్గాలను రచిస్తూ.. ప్రజల్లో భరోసా నింపుతూ ముందుకు సాగుతున్నారు. కాగా, వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర నిన్నటితో 50రోజులు పూర్తి చేసుకుని 700 కిలోమీటర్ల మార్క్‌ను దాటింది. అయితే, చిత్తూరు జిల్లా పీలేరు నియోజవర్గం పరిధిలోగల జమ్మివారిపల్లి వద్ద ప్రజా సంకల్ప యాత్ర ఏడువందల కిలోమీటర్లు దాటడం విశేషం.
అసలు విషయానికొస్తే.. ఇప్పటి వరకు రాయలసీమలోని మూడు (కడప, అనంతపురం, కర్నూలు) జిల్లాల్లో తన పాదయాత్రను పూర్తి చేశారు వైఎస్ జగన్. ఆయా జిల్లాల్లో మెజార్టీ నియోజకవర్గాల్లో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. జగన్ వెంట మేము సైతం అంటూ ప్రజలు.. జగన్ అడుగులో అడుగులు వేస్తూ నడిచారు కూడా. అంతేగాక, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్రకు అద్భుత స్పందన రావడం జగన్‌కు శుభపరిణామమేనని చెప్పక తప్పదు.
అయితే, ప్రస్తుతం జగన్ చిత్తూరు జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లాలో జగన్ పాదయాత్ర అలా ఎంటర్ అయిందో.. లేదో.. చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో కూడా జగన్‌కు బ్రహ్మాండమైన ప్రజల మద్దతు లభించింది. జగన్ పాదయాత్ర సాగుతున్నంత సేపు.. జగన్‌వెంటే మేము అంటూ చిన్నారుల నుంచి వృద్ధుల వరకు.. జగన్ అడుగులో అడుగు వేస్తున్నారు.
చిత్తూరు జిల్లా చంద్రబాబుకు ఓన్ కావడం, భారీ ఎత్తున ఫిరాయింపులు కూడా జరిగిన విషయం తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో సుబ్రహ్మణ్యం లాంటి ఔట్‌డేటెడ్ వాళ్లను తెలుగుదేశంపార్టీ తనపంచన చేర్చుకుని ఆనందపడుతోందని ప్రజల అభిప్రాయం.