కొత్త సంవత్సరం ఇయర్ ఆఫ్ టెక్నాలజీగా తెలంగాణ పోలీస్ శాఖ పనిచేస్తుందని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ లోని తన కార్యాలయంలో టీఎస్ కాప్ మొబైల్ యాప్ ని ఆయన ప్రారంభించారు. దేశంలోనే మొదటిసారి తెలంగాణలో పోలీస్ శాఖ మొబైల్ యాప్ ప్రారంభించిందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. టెక్నాలజీ వినియోగంతోనే రియల్ టైమ్ పోలీసింగ్ సాధ్యమన్నారు.
టీఎస్ కాప్ యాప్ లో 54 సేవలు ఉంటాయని, క్షేత్రస్థాయి సిబ్బందికి దీన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. డయల్-100 కి వచ్చే ఫిర్యాదులు నేరుగా సమీపంలోని పోలీస్ సిబ్బందికి చేరుతాయని, తక్షణమే పోలీసులు అప్రమత్తమై సంఘటన స్థలానికి చేరుకుంటారని తెలిపారు.
టీఎస్ కాప్ యాప్ లో కీలకమైన బీట్ మేనేజ్ మెంట్, ఎంవో అఫెండర్స్ చెకింగ్, జైల్ రిలీజ్ మేనేజ్ మెంట్, క్రైం మ్యాపింగ్, ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ తో పాటు కీలకమైన అన్ని వివరాల ద్వారా రాష్ట్రస్థాయి నుండి ఉన్నత అధికారి వారికి అందుబాటులో ఉంటారని డీజీపీ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాప్ ను అన్ని పోలీస్ విభాగాల్లో పనిచేసే విధంగా అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. నేరాలను అదుపు చేయడంతో పాటు నేరాలు జరిగిన ప్రదేశాలకు సత్వరం పోలీసులు చేరుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు.
పోలీస్ విధి విధానాలు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కు ఫింగర్ ప్రింట్స్ తో సహా అన్నిటికి ఈ యాప్ ఉపయోగపడుతుందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. జియో ట్యాగింగ్ ద్వారా టీఎస్ కాప్ యాప్ ను అనుసంధానం చేస్తే నేరాలు జరిగిన ప్రదేశాలకు త్వరగా చేరడంతో పాటు ఫోర్స్ ను అప్రమత్తం చేయొచ్చన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నేరాలను అదుపుచేయడానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని నేర రహితంగా తీర్చిదిద్ది, శాంతి భద్రతల పరిరక్షణకు ఈ యాప్ దోహదపడుతుందని డీజీపీ వివరించారు.