తెలంగాణ రాష్ట్రంలో నేడు అమలవుతున్న సంక్షేమ పథకాలన్నింటికీ తెలంగాణ ఉద్యమ సమయంలోనే రూపకల్పన చేశామని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. సిరిసిల్లలోని మంత్రి కేటీఆర్ నివాసంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డితో కలిసి ఎంపీ వినోద్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు.
ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న చాలా కార్యక్రమాలు నాడు రాష్ట్ర ఏర్పాటు కోసం వేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదికలో పొందుపరిచామన్నారు. రాష్ట్రంలో అధిక శాతమున్న బలహీనవర్గాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ స్వయం ఉపాధి పథకాలు ప్రకటిస్తుంటే, ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు. నాడు ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్ తరఫున ప్రొఫెసర్ జయశంకర్, తాము వెళ్లి శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇచ్చామని, అందులోనే రాష్ట్రం ఏర్పడితే అభివృద్ధి ఎలా జరుగుతుందో వివరించామన్నారు. దూరదృష్టితో సీఎం కేసీఆర్ చేసే ఆలోచనలు భవిష్యత్తుతరాలకు మేలు చేస్తున్నాయన్నారు.